- ప్రతిష్టాత్మకంగా మారిన మేయర్ పదవి
- బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి మధ్య మళ్లీ పోటీ
- ఇద్దరు నేతల భార్యలు కార్పోరేటర్లుగా బరిలోకి
- కార్పోరేషన్ చైర్మన్ పదవి కోసం గుమ్మల పట్టు
- మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్సే
- అభ్యర్థుల ఎంపిక పైన గందరగోళం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ మేయర్ పదవి పెద్ద తల పోటుగా మారింది. తొలిసారి మేయర్ మహిళకు రిజర్వు కావడంతో ఇద్దరు కీలక నేతల మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో మంత్రి కోమటిరెడ్డి ఎపిసోడ్ వేడి చల్లారక ముందే నల్లగొండ మేయర్ పదవి కోసం ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. మేయర్ పదవి గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్తున్నారు. 2014లో కూడా వీరిద్దరి మధ్య ఇదేరకమైన పోటీ ఎదురైంది, ఆ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళలకు రిజర్వు అయ్యింది. చైర్మన్ పదవి కోసం ఇద్దరు గట్టిగానే పోటీ పడ్డారు. వీళ్లద్దరిని బుజ్జగించేందుకు అప్పట్లో గట్టి ప్రయత్నాలే జరిగాయి, కానీ చివరకు మంత్రి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి భార్య సుజాతనే చైర్మన్‌గా ప్రకటించినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. దాంతో చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ శ్రీనివాస్ రెడ్డికి, మోహన్ రెడ్డికి మధ్య అప్పటి నుంచే విభేదాలు మొదలయ్యాయి. అనూహ్యంగా బీసీ మహిళ బొడ్డుపల్లి లక్ష్మీ చైర్మన్ కాగా, వైస్ చైర్మన్ పదవితో శ్రీనివాస్ రెడ్డి సరిపెట్టుకున్నారు.
మధ్యలో టీఆర్ఎస్లో చేరిక
కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులు నచ్చక అప్పటి బీఆర్ఎస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో మోహన్ రెడ్డి కీలక నేతగా ఎదిగారు. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నర్సింహారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాక పోవడంతో కోమటిరెడ్డికి మద్ధతుగా దుబ్బాకతో సహా, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, ఇంకొంత మంది కౌన్సిలర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌లో వచ్చారు, కానీ ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి ఎమ్మెల్యే గా ఓడిపోయి, భువనగిరి ఎంపీగా గెలిచారు. కోమటిరెడ్డి ఎంపీగా వెళ్లిపోయినప్పటి నుంచి మోహన్ రెడ్డి నల్లగొండ పార్టీ బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. చివరకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరింది. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో వీళ్లద్దరితో పైచేయిగా నిలుస్తోంది, కానీ తాజాగా మేయర్ పదవి వీళ్లద్దరి మధ్య మరోసారి చిచ్చురాజేసింది.
ఏకపక్ష ప్రకటన పైన మోహన్ గుర్రు
ఇప్పటి వరకు అధికారికంగా మేయర్ ఎవరనేది ప్రకటించలేదు, కానీ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం నల్లగొండకు వచ్చిన మంత్రి బుర్రికి లైన్ క్లియర్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏకపక్షంగా మేయర్ క్యాండేట్‌ను డిసైడ్ చేయడం పట్ల మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. ఇన్నాళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తనకు ఎలాంటి పదవి దక్కకపోగా, మేయర్ పదవి గురించి ఏమాత్రం చర్చించకుండా శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి రావడం మోహన్ అనుచరులకు నచ్చలేదు. పార్టీ మారొచ్చిన శ్రీనివాస్ రెడ్డి గతంలో వైస్ చైర్మన్ పదవితోపాటు, మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. కానీ 2014లో చైర్మన్ పదవి కోసం నిలబడ్డ తన భార్య సుజాత ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోహన్‌కు ఎలాంటి పదవి దక్కలేదు. పార్టీ అధికారంలో లేని పదేళ్లలో కేడర్‌ను కాపాడుకుంటూ వస్తోన్నా అధికారంలోకి వచ్చాక పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, డీసీసీ, కార్పోరేషన్ చైర్మన్ ఇలా అనేక పర్యాయాలు పదవుల కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఇప్పుడు మేయర్ రూపంలో అవకాశం కలిసొచ్చింది. ఈ ఛాన్స్ కూడా చేజారిపోతే రాజకీయ మనుగడ ప్రశ్నాకర్ధమవుతుంది. కావున మేయర్ అభ్యర్థిని ప్రకటించడం కంటే ముందే రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ విషయంలో స్పష్టమైన హామీ కోసం మోహన్ పట్టుబడుతున్నట్టు తెలిసింది.
కార్పోరేటర్‌గా పోటీ ఖాయం
బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యతో పాటే మోహన్ రెడ్డి కూడా తన భార్య సుజాతను కార్పోరేటర్‌గా నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 13 వార్డు జనరల్ మహిళలకు రిజర్వు అయ్యింది. గతంలో జానకి పోటీ చేసిన మర్రిగూడ కొంత భాగంతో పాటు, విద్యుత్ నగర్, గిరకబావిగూడెం ఏరియా కలిసొస్తుంది. పైగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా 11 వార్డులకు మోహన్ ఇన్చార్జిగా ఎప్పటి నుంచే పనిచే స్తున్నారు. గతంలో రూరల్ కింద ఉన్న ఈ వార్డులు మున్సిపాలిటీ లో విలీనం అయినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఒకవేళ మేయర్ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి భార్యను ప్రకటించిన ప్పటికీ తన భార్య మాత్రం కార్పోరేటర్‌గా పోటీలో ఉండటం ఖాయమని అంటున్నారు.
రెండు రోజులుగా ఎడతెగని చర్చలు
రాష్ట్రంలో మంత్రి కోమటిరెడ్డి ఎపిసోడ్ వేడి చల్లారకముందే నల్లగొండ లో మేయర్ పదవి గురించి సీనియర్లు పోటీపడటం మరింత వేడిని రాజేసింది. మేయర్ పదవి గురించి కోల్ట్‌వార్ నడుస్తోందని పార్టీలో చర్చించుకుంటున్నారు. గత రెండు రోజులు నుంచి పార్టీ క్యాంపు ఆఫీసులో ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి. మోహన్ రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ పదవి గురించి ప్రభుత్వ పెద్దల నుంచే స్పష్టమైన హామీ వస్తే తప్పా మేయర్ పదవి పైన క్లారిటీ వచ్చేలా లేదు. 48 వార్డుల్లో 8 వార్డుల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. ఇప్పటి కైతే సిట్టింగ్ కౌన్సిలర్లకు ఢోకా లేదు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటిలిజెన్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఎంపిక చేస్తారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రె స్కు కష్టాలు తప్పవని తెలిసింది. దీన్ని నుంచి గట్టెక్కేందుకు పలువురు పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. కమిటీలో బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, పాశం రాంరెడ్డితో పాటు పలువురు సీనియర్లకు అప్పగించారు. అందరీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిసింది.