ఎన్నికలప్పుడే రాజకీయాలు… తర్వాత అభివృద్ధి పైనే ఫోకస్​: మేయర్​ బుర్రి చైతన్య

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పైనే దృష్టి పెడతానని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో తొలిసారిగా జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా నీలగిరి నగరాభివృద్ధే ధ్యేయంగా మందుకు పోదామని, అన్ని డివిజన్లలో సమస్యలకు పరిష్కారంచూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిద్దామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికైన కార్పోరేటర్లు అందరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. పలు డివిజన్లలో డ్రైయినేజీ, రోడ్లు సమస్య ఉందని, త్వరగా పనులు పూర్తి అయ్యేవిధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లలో వారానికోసారి చెత్త ట్రాక్టర్లు వస్తున్నాయని, దాంతో చెత్త కుప్పలు పేరుకుపోతున్నట్టు సమావేశంలో మేయర్ దృష్టికి తెచ్చారు. కొన్ని పెద్ద డివిజన్లు ఉన్నందున సిబ్బందిని ఎక్కువగా కేటాయించాలని కోరారు. వీది దీపాలు కొన్ని చోట్ల వెలగడం లేదని, కొత్త లైట్లు, తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్పోరేటర్లు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు మేయర్ సుదీర్ధంగా సమాధానం చెప్పారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్లలో పనులు వేగంంతం చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు, సిబ్బందితో మాట్లాడి చెత్త సమ్య రాకుండా తక్షణ చర్యలు చేపడ్తామని తెలిపారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో దత్తత పేరుతో కేసీఆర్ పనులు ప్రారంభించి వదిలేస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాక అన్ని పనులు పూర్తి చేయిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో 24 గంటల పాటు తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ మహ్మద్ మాట్లాడుతూ మైనార్టీ కార్పోరేటర్లకు ఏజెండా బుక్ ఊర్దులో తయారు చేసి ఇవ్వాలని మేయర్ను కోరారు.

Share
Share