Good News: నల్లగొండ జర్నలిస్టుల ఇళ్ల జాగలకు లైన్ క్లియర్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు శుభవార్త. దశాబ్ధన్నర కాలం నుంచి ప్లాట్ల కోసం జరుగుతున్న పోరాటం తుది అంకానికి చేరుకుంది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో ఒప్పించి 5.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఏచూరి గార్డెన్స్ సమీపంలో 3 ఎకరాలు, రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రెండె కరాలు అలాట్ చేశారు. కానీ వివిధ కారణాల రీత్యా ఆ స్థలం జర్నలిస్టులకు దక్కకుండానే మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రాజీవ్ స్వగృహా జాగలో బీపీఎల్(BPL) కింద ప్లాట్లు ఇచ్చే ప్రయత్నం జరిగింది, కానీ కమ్యూనిస్టు పార్టీలు అభ్యంతరం చెప్పడంతో అవి కూడా దక్కలేదు.

గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్లాట్ల కోసం సర్వే చేయించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగాయి, కానీ జర్నలిస్టుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆ ప్రక్రియ కూడా మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు ఇళ్ల జాగాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిలో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన స్థలాన్ని తిరిగి అప్పగించాలని నల్లగొండ జర్నలిస్టులు మంత్రి కోమటిరెడ్డిని కోరడం జరిగింది.

మంత్రి జోక్యంతో 18 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్ మళ్లీ కదలిక వచ్చింది. ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం కేటాయించిన స్థలాన్ని జాయింట్ సర్వే చేయమని మంత్రి కోమటిరెడ్డి గత కలెక్టర్ నారాయాణ రెడ్డిని ఆదేశించారు. దాంతో ఆర్డీఓ(RDO) సూచన మేరకు నల్లగొండ తహాశీల్దార్ 5 ఎకరాలను సర్వే చేయగా, దాంట్లో కొంత భాగం ఆక్రమణకు గురైనట్టు తేలింది. దానికి బదులుగా మరొక ప్రాంతంలో జాగ కేటాయించాలని జర్నలిస్టులు కోరారు. ప్రస్తుతం ఈ ఫైల్ ఆర్డీఓ నుంచి కలెక్టరేట్ కు చేరింది.

రెండు గ్రూపులుగా విడిపోయిన జర్నలిస్టులు ఏకతాటిపైకొస్తే జాగ కేటాయింపు ప్రక్రియ మరింత సులువుగా మారనుంది. సీనియర్ జర్నలిస్టు ఫహీం ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఐక్యత కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు, కానీ సంఘాల మధ్య మనస్పర్ధలు, జర్నలిస్టులు రెండు ప్రెస్ క్లబ్లు విడిపోవడం వల్ల సమస్య కొలిక్కి రావడం లేదనే అభిప్రాయం నెలకొంది. హైదరాబాద్ కు చెందిన నల్లగొండ సీనియర్ జర్నలిస్టులు ఈ వ్యవహారం లో కొంత జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు, కానీ పంతాలకు పోవడం వల్ల ప్లాట్ల సమస్య కొలిక్కి రాకపోగా, సందర్భంగా చిక్కినప్పుడుల్లా మంత్రి కోమటిరెడ్డిని మీడియా సమావేశాల్లో ప్రశ్నించడం జరుగుతోంది. ఇటీవల నల్లగొండ మీడియా సమావేశంలో ప్లాట్ల గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి ఘాటుగానే స్పందించారు. జాగల కేటాయింపు ఎప్పుడో జరిగిపోయిందని, కలెక్టర్ కు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, మీరంతా సమిష్టిగా కృషి చేస్తే వీలైనంత త్వరగా జాగల కేటాయంపు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని కూడా స్పష్టం చేశారు.

సీనియర్ జర్నలిస్ట్ ఫహీం జర్నలిస్టుల పక్షాన మళ్లీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ లో పెండింగ్ లో ఉన్న ఫైల్ ను కదలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డీఓ నుంచి వచ్చిన రిపోర్ట్ ను పరిశీలించి, దానికి అనుగుణంగా దేవరకొండ రోడ్డు లేదా మునుగోడ బైపాస్ రోడ్డు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని వీలైనంత త్వరగా జర్నలిస్టులకు అప్పగించే కార్యక్రమం జరగనుంది. అంతేగాక హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు అనుబంధంగా నల్లగొండలో నూతన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కూడా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇళ్ల జాగలు, ప్రెస్ క్లబ్ బిల్డింగ్ భవానానికి అవసరమైన స్థలాన్ని మంజూరు చేయడంలో అవసరమైతే మళ్లీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కేబినెట్లో ఆమోదం తీసుకుంటాని మంత్రి గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా ఏ ఒక్కరితోనే సాధ్యం కాదని, రెండు ప్రెస్ క్లబ్ లు, జర్నలిస్టుల సంఘాలు కలిసికట్టుగా కృషి చేస్తే తొందర్లోనే జాగలు లభిస్తాయని పలువురు జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Share
Share