- నల్లగొండ జిల్లా కమిటీలో చోటు కోసం పోటాపోటీ
- స్టేట్ లీడర్ల నుంచి అధికారుల పైన ఒత్తిడి
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ‘రెడ్ల’కే ప్రయార్టీ
- బీసీ జర్నలిస్టులను అణిచివేస్తున్న స్టేట్ లీడర్లు
- మంత్రి కోమటిరెడ్డితో చర్చించకుండా ఆఫీసర్ల ఏకపక్ష నిర్ణయం?
- బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి జగదీష్ ఆదేశాలే అమలు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చోటెలా?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా చోటు దక్కించుకునేందుకు రెడ్డి, బీసీ వర్గాలకు చెందిన జర్నలిస్టుల నడమ వార్ నడుస్తోంది. ఇన్నాళ్లు రాజకీయాలకు అతీతంగా సీనియార్టీకే ప్రాధాన్యత ఇచ్చిన అక్రిడిటేషన్ కమిటీకి కొత్తగా రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ హయాం నుంచి మొదలైన ఈ వార్ తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలో పరాకాష్టకు చేరింది. అక్రిడిటేషన్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా, దీంట్లో వివిధ జర్నలిస్టుల సంఘాలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సీనియర్ పాతిక్రేయులకు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లను సభ్యులుగా నియమిస్తారు. వీళ్లను సభ్యులుగా నియమించే అధికారం జిల్లా కలెక్టర్ కే ఉంటుంది.
జిల్లా పౌరసమాచార శాఖలో నమోదైన జర్నలిస్టుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించే జర్నలిస్టును సభ్యులుగా చేర్చడం జరుగుతోంది. గత కొన్నేళ్ల నుంచి జర్నలిజంలో రాణిస్తున్న సీనియర్ బ్యూరో ఇన్చార్జిలకు, స్టాఫర్లకు, కెమెరామన్లకు, ఫోటో గ్రాఫర్లకు చోటు కల్పిస్తారు, కానీ బీఆర్ఎస్ హయాం నుంచి నయా ట్రెండ్ తెరపైకొచ్చింది. కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ఆసక్తి చూపే జర్నలిస్టులు సంఘాలతో సంబంధం లేనప్పటికీ వృత్తి పట్ల నిబద్ధత ఉన్న జర్నలిస్టులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది, కానీ ఈసారి నల్లగొండలో అందుకు భిన్నంగా అధికారులు వ్యవహారిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
మంత్రి కోమటిరెడ్డితో చర్చించకుండా ఎట్లా…?
జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా ఎవరిని నియమించాలనే అధికారం కలెక్టర్ కే ఉంటుంది, కానీ దాంట్లో ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహారించే జర్నలిస్టులతో పాటు, సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తారు. గతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూచన మేరకు ప్రధాన పత్రికల్లో పని చేసిన బ్యూరో ఇన్చార్జిలకు కమిటీలో చోటు కల్పించారు. జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చేదాంట్లో కూడా మంత్రుల సూచనలు తప్పనిసరి. జిల్లాలో 2022లో చివరిసారిగా అక్రిడిటేషన్ కమిటీ నియామకం జరిగింది. మళ్లీ తాజాగా ఆ ప్రక్రియ మొదలైంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్లను కమిటీలో సభ్యులుగా చేర్చడం విమర్శలకు దారి తీస్తోంది. అసలు కమిటీలో ఎవరిని సభ్యులుగా చేర్చాలనే దాని గురించి అధికారులు కనీసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించకపోవడం మరింత వివాదస్పదమైంది. ఆయన అభిప్రాయం తీసుకోకుండా స్టేట్ లీడర్ల ఒత్తిడి మేరకు ఏకపక్ష నిర్ణయం తీసుకునే దిశగా అధికారులు ఆలోచన చేయడం మరింత వివాదస్పదమైంది.
బీసీ జర్నలిస్టుల పట్ల ఎందుకీ వివక్ష…?
నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండు ప్రెస్ క్లబ్లు పనిచేస్తున్న రెడ్ల పెత్తనమే నడుస్తోంది. కొత్తగా నియమించే అక్రిడిటేషన్ కమిటీలో సైతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న రెడ్డి జర్నలిస్టులనే కమిటీలో మెంబర్స్ గా చేర్చేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతోంది. ప్రింట్ నుంచి ప్రధాన పత్రిక బ్యూరో ఇన్చార్జి (రెడ్డి)ని సభ్యుడిగా నియమించేందుకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది, కానీ మళ్లీ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా రెడ్డి జర్నలిస్టుకే ప్రయార్టీ ఇవ్వాలని అనుకోవడం, పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జర్నలిస్టులను సభ్యుడిగా చేర్చడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక భావజాలం కలిగిన జర్నలిస్టులను, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంతో సంబంధాలు కలిగిన చానళ్ల రిపోర్ట్లను అక్రిడిటేషన్ కమిటీలో చోటు కల్పిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నిత్యం జిల్లా మంత్రితో సన్నిహితంగా మెలిగే బీసీ జర్నలిస్టుల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ప్రింట్ మీడియాలో సైతం ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న బీసీ బ్యూరో ఇన్చార్జిలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ రెడ్లకే ఇవ్వాలని భావిస్తే అందరికీ ఆమోదయోగ్యమైన సీనియర్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారని వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుంటే మంచిదని, లేదంటే భవిష్యత్తులో జర్నలిస్టుల మధ్య విభేదాలు మరింత ముదిరిపోయే ప్రమాదం ఉందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.