- నల్లగొండ కార్పోరేషన్లో కాంగ్రెస్ రూ.25 లక్షలు,
- బీఆర్ఎస్ రూ.10 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం
- చాలా మంది అభ్యర్థులకు చేరిన ఎన్నికల ఫండ్
- చివరి నిమిషంలో డబ్బులు సరిపోక ఇబ్బందులు
- ఏంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, బీజేపీతో చీలిన ఓట్లు
- పోలింగ్ సరిళి పైన అధికార, ప్రతిపక్ష నేతల అంచనా
- కాంగ్రెస్ 28, బీఆర్ఎస్ 15 ప్లస్, బీజేపీకి 3 వచ్చే ఛాన్స్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం పంపిన పార్టీ ఫండ్ ఓటర్లకు చేరలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు కొందరు అభ్యర్థులకు పార్టీ ఫండ్ చేరలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి పైన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా, చివరి నిమిషంలో డబ్బులు చాలక ఇబ్బందులు పడ్డ అభ్యర్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కో అభ్యర్థికి రూ.25 లక్షలు, బీఆర్ఎస్ రూ.10 లక్షలు పార్టీ ఫండ్ పంపినట్లు తెలిసింది. అయితే కొందరి అభ్యర్థులకు రూ.15 లక్షలు మాత్రమే చేరిందని, బీఆర్ఎస్లో అసలు కొందిరికి పార్టీ వైపు నుంచి ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు పోలింగ్ రోజున కూడా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. కానీ డబ్బులు చేతికందకపోవడంతో ఆ ప్రభావం పోలింగ్ పైన పడిందని ఆందోళన చెందుతున్నారు. కొన్ని వార్డుల్లో ఓటుకు నాలుగైదు వేలు కూడా ముట్టచెప్పారు. పార్టీ ఫండ్ ఇవ్వకుండా ఏదో రకంగా సర్ధుబాటు చేసుకోమని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని పార్టీల నేతలు దాట వేశారని అభ్యర్థులు వాపోతున్నారు.
ప్రజలు ఆదరిస్తరనే ఆస్తులు తాకట్టు పెట్టిర్రు
పార్టీ ఫండ్ పంపిన డబ్బుగాక చాలా మంది సొంతగా ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు రూ. 50 లక్షల వరకు ఖర్చు చేయగా, బీఆర్ఎస్ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టు చెపుతున్నారు. గత ఎన్నికల్లో ఓడి పోయిన అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుభూతి కనిపిస్తదని చాలా మంది నమ్మకంతో ఉన్నారు. వరుసగా మూడు, నాలుగు పర్యాయాలు నుంచి గెలుస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. భర్తల బదులు భార్యలు, కుదరకపోతే కూతుళ్లను సైతం పోటీలో దింపారు. ఇలా వరుసగా మూడు, నాలుగు పర్యాయాలు గెలుస్తున్న అభ్యర్థుల పైన ఓటర్ల లో మిశ్రమ స్పందన కనిపించింది.
చీలిన ఓట్లతోనే భయం
కార్పోరేషన్లో 48 వార్డుల్లో 221 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే బీజేపీ, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్లు పోటీచేసిన వార్డుల్లో గెలుపోటముల పైన అనుమానాలు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు, మైనార్టీ ఓట్లు సైతం ఏఐఎం అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చిన వార్డుల్లో కాంగ్రెస్కు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రులు, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన వార్డుల్లో సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతే గట్టెక్కే అవకాశం ఉండొచ్చని, లేదంటే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు. ఏంఐఎం 8, ఫార్వర్డ్ బ్లాక్ 11, ఇండిపెండెంట్లు 41 మంది పోటీ చేశారు. దీంతో ఓట్ల చీలిక ప్రభావం కాంగ్రెస్ మీద పడితే తామే గెలుస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రత్యర్ధులు చీలిస్తే అంతిమంగా పోలయ్యే ఓట్లతో మెజార్టీ తమకే వస్తదని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇంటిలిజెన్స్ రిపోర్ట్లతో కలవరం
ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు అధికార పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్కు 35 డివిజన్లు పక్కాగా వస్తాయని ఆపార్టీ నేతలు అంచనా వేశారు. కానీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం కాంగ్రెస్ 28, బీఆర్ఎస్ 15కు పైగా సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. బీజేపీ మూడు డివిజన్ల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికలు మంత్రి కోమటిరెడ్డికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 45 సీట్లు గెలుస్తామని ముందు నుంచీ ధీమాతో ఉన్నారు. కానీ ఓట్ల చీలిక, సిట్టింగ్ కౌన్సిలర్ల మీద ప్రజల్లో ఉన్న స్పందన పోలింగ్ తర్వాత పరిశీలించాక గెలుపోటముల పైన అంచనాలు తప్పినట్టు కనిపిస్తోంది.
ఈ వార్డుల పైనే కాంగ్రెస్, బీఆర్ఎస్ గురి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా కొన్ని కీలకమైన డివిజన్ల పైనే గురిపెట్టారు. ఈ వార్డుల్లో ఎవరికి వారే గెలుస్తామని పోలింగ్ సరళిని బట్టి నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. 1,3,4,5,7,9,11,14,15,16,17,20,24,29,31,34,37,47,48 డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ జరిగింది. 2,8,10,25 డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ట్రాయాంగిల్ వార్ నడిచింది. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోటా కింద పోటీ చేసిన యామా దయాకర్ కవిత, బషీర్, అయితగోని స్వామిగౌడ్ డివిజన్లలో కూడా కాంగ్రెస్, బీఆర్స్ గెలుపు పైన ధీమాతో ఉన్నారు.