APB News Exclusive: నల్లగొండ కాంగ్రెస్​లో ఆరని మంటలు! పున్నా కైలాష్ vs మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులకు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. కైలాష్ నేతను జిల్లా ప్రెసిడెంట్ చేయడం నచ్చని మంత్రి వర్గీయులు ఆయన్ని నల్లగొండలో అడుగుపెట్టనివ్వడం లేదనే సంగతి తెలిసిందే. చివరకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బీఫాంలు సైతం కైలాష్ చేతుల మీదుగా తీసుకునేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ద్వారానే అభ్యర్థుల బీఫాంలు తెప్పించుకున్నారు. మునుగోడు బైపోల్లో కోమటిరెడ్డిని నోటికొచ్చినట్టు తిట్టినప్పటినుంచే కైలాష్ పైన మంత్రి అనుచరులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కైలాష్ పెట్టిన చిచ్చు అగ్గికి ఆజ్యం పోసినట్లైంది.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న కైలాష్ నేత నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులనే ఓడగొట్టేందుకు తెరవెన కుట్రపన్నారని మంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల గెలుపోటముల పైన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కైలాష్ వర్గీయులు పలు డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు సపోర్ట్ చేశారని, దాంతోనే కాంగ్రెస్ క్యాండేట్లు ఓడిపోయారని చెప్తున్నారు. మంత్రి కోమటి రెడ్డి స్వయంగా ఫలితాల పైన నిర్వహించిన పోస్టుమార్టంలోనూ ఇదే తేలిందని, కైలాష్, అతని అనుచరులు పాల్పడిన పార్టీ వ్యతిరేక చర్యలను ఆధారాలతో సహా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. అట్లాగే రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ను రేపోమాపో కలిసి కైలాష్ పైన చర్య తీసుకోవాలని కోరనున్నట్టు తెలిసింది.

మంత్రి వెంకటరెడ్డి మీద ఉన్న కోపంతో కైలాష్ వర్గీయులు పోలింగ్ ముందు రోజున ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, కైలాష్ బందువులకు, స్నేహితులకు నేరుగా ఫోన్లు చేసి సింహాం గుర్తుకు ఓట్లు వేయమని చెప్పారని దాంతోనే 39 వార్డులో గెలవాల్సిన మల్లికార్జున యాదవ్ ఓడిపోయారని చెప్తున్నారు. మల్లికార్జున్ గెలిస్తే డెప్యూటీ మేయర్ పదవి వచ్చేది. బీసీలకు డెప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలనే ఆలోచనతోనే మల్లికార్జున్ను బరిలో దింపారని, ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు, పార్టీ సర్వేల్లో ఆయన 90 శాతం గెలుస్తారని వచ్చిందని, కానీ రాత్రికి రాత్రి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో మల్లికార్జున్ ఓడిపోయిండని చెప్తున్నారు. అదేవిధంగా పద్మానగర్లో కూడా ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నారని అంటున్నారు. మల్లికార్జున్ గెలిస్తే రాజకీయంగా తమ ఎదుగుదలకు అడ్డొస్తడనే ఉద్దేశంతో కొంత మంది కాంగ్రెస్ లీడర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు సైతం కైలాష్తో చేతులు కలిపారని ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రదీప్ నాయక్, జానయ్య ఓటమికి కూడా ఇవే పరిస్థితులు దారితీశాయని, సింహాం గుర్తు మీద పోటీచేసిన అభ్యర్థులకు సపోర్ట్ చేయడం ద్వారా అంతిమంగా ఓట్లచీలి కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాల య్యారని అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమని, వీటిని పార్టీ హైకమాండ్ చక్కబెట్టకపోవడం వల్లే నేతల మధ్య మంటలు చల్లారడం లేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కైలాష్ నల్లగొండలో అడుగుపెడితే రాజకీయంగా తమ ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశం తోనే ఆయన్ని చులకనగా చూస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు సైతం పిలవడం లేదని, కనీసం పార్టీ ఫ్లెక్సీలో కూడా కైలాష్ ఫోటో పెట్టడం లేదని, గతంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్కు ఇచ్చినంత ప్రయార్టీ ఇప్పుడు నల్లగొండలో కైలాష్కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంత్రి వర్గీయులకు, డీసీసీ అధ్యక్షుడికి మధ్య జరగుతున్న గొడవల గురించి పార్టీ హైకమాండ్ కు తెలిసినా పట్టించుకోకపోవడం వల్లే కార్పోరేషన్ ఎన్నికల్లో దెబ్బ తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు బీసీ లీడర్లు అంటున్నారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలకు కైలాష్ స్వయంగా వెళ్లి బీఫాం లు అందజేస్తే, నల్గొండలో మాత్రం శంకర్ నాయక్కు ఇప్పించి కైలాష్ను అవమానించారని అంటున్నారు. ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేల సపోర్ట్తోనే కైలాష్కు అధ్యక్ష పదవి వచ్చిందని మంత్రి వర్గం జీర్ణించుకోలేకపోతుందని, ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా కైలాష్ వర్గీయులు అంటున్నారు.

Share
Share