APB News Exclusive: కైలాసా… కాంగ్రెస్ ఆఫీస్ కలేనా? కట్టేనా?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసు నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. డీసీసీ అధ్యక్షులు మారుతున్నారే తప్పా పార్టీ ఆఫీసు కోరిక మాత్రం తీరడం లేదు. ఉద్దండులు రాజ్య మేలుతున్న జిల్లాలో శాశ్వత భవనం లేకపోవడంతో పార్టీ కేడర్లో నిరుత్సాహాం నెలకొంది. ఇటీవల ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసులు కట్టుకునేందుకు ఎకరం జాగ కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చింది. పొరుగునే ఉన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కుడకుడ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వగానే భూమి పూజ చేస్తామని జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య చెప్పారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలో స్థల కేటాయింపులు ఇంకా చేయలేదు. యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అప్పటి కలెక్టర్ హనుమంతురావును కలిసి వినతి పత్రం ఇచ్చారు, కానీ కలెక్టర్ మారడంతో ఫైల్ పెండింగ్లో పడింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంధ్రశేఖర్ను జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత స్థలం కేటాయించాలని కోరారు. కానీ నల్లగొండలో పార్టీ ఆఫీసు స్థల కేటాయింపు అనేది కార్పోరేషన్ తీర్మానం పైన ఆధారడి ఉంటది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి లేకుండా అంత సులువుగా పార్టీ ఆఫీసు స్థలం ఇవ్వడం జరగదని వ్యతిరేక వర్గం చెప్తోంది, పైగా కైలాష్ నేతతో ఉన్న వ్యక్తిగత గొడవలు స్థల కేటాయింపుకు అడ్డంకిగా మారాయి.

పున్నా కైలాష్ నేతతో పార్టీ ఆఫీసు సాధ్యమవుతుందా? అంటే పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కైలాష్ కి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి మంత్రి వర్గీయులు ఆయన్ని నల్లగొండలో నే అడుగు పెట్టనివ్వడం లేదు, కనీసం ఫ్లెక్సీల్లో ఫోటోలు కూడా పెట్టడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డిని నోటికొచ్చినట్టు కామెంట్స్ చేశారనే కోపంతో కైలాష్ను రానివ్వడం లేదు. పైగా మంత్రి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆశించిన డీసీసీ పదవి కైలాష్కు ఇవ్వడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. సమీకరణాల మేరకు యాదాద్రి బీసీలకు, సూర్యాపేట ఎస్సీలకు ఇచ్చినప్పుడు, నల్లగొండ ఓసీ లకు ఇస్తే బాగుండేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడనే ఒకే ఒక్క కారణంతో మోహన్కు అన్యాయం జరిగిందనే అభిప్రాయం పార్టీలో బలంగా పాతుకుపోయింది. పార్టీలో నెలకొన్న గ్రూపు గొడవల నేపథ్యంలో కైలాష్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు నల్లగొండ పార్టీ ఆఫీసు నిర్మాణం కష్టమని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.

జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసు అందరికి వర్తిస్తుంది. కైలాష్ మీదున్న కోపంతో స్థలం ఇవ్వకపోతే ఆ ప్రభావం ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన పడుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కైలాష్ ను టార్గెట్ చేయడం వల్ల పార్టీకే నష్టం తప్పా వ్యక్తిగతంగా ఎవరికీ ప్రయోజనం ఉండదని పొరుగునే ఉన్న ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయ పడ్డారు. నల్లగొండలో బీఆర్ఎస్ ఆఫీసు కూలగొట్టేందుకు ప్రయత్నించినప్పుడు లేని అడ్డంకులు సొంత పార్టీ ఆఫీసు వ్యవహారంలో రాజకీయాలు ఎందుకుని మరో ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంటే తప్పా సమస్య పరిష్కారం కాదని మరొక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. కైలాష్ను అధ్యక్షుడిగా ప్రకటించడానికి ముందు గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి కలిసి జడ్పీ పక్కనే ఉన్న బాలభవన్ స్థలం  కేటాయించాలని అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు, కానీ బాలభవన్, మహిళ మండళ్లకు ఇచ్చిన జాగలను ఇతర అవసరాలకు ఇచ్చేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వాలనే నిబంధన అడ్డొస్తుందనే కారణంతో ఆ ప్రతిపాధన మధ్యలోనే ఆగిపోయింది.

నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని గొప్పగా చెప్పుకునే ఉద్దండులు ఉన్న జిల్లాలో పార్టీ ఆఫీసు చరిత్రగానే మిగిలింది. 2004లో నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో డీసీసీ ఆఫీసుకు శంకస్థాపన చేశారు. సీనియర్ నేతలు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయాణ పార్టీ ఆఫీసు శిలాఫలకం వేశారు. సీనియర్ల మధ్య సమన్వయం కుదరక బిల్డింగ్ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. అదే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే అన్ని జిల్లాలో కొత్తగా పార్టీ ఆఫీసులు నిర్మించింది. హైటెక్ హంగులతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు, ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ఆఫీసులు సుందరంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ ఆఫీసు మాత్రం 22 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు.

Share
Share