- ఎల్పీజీ(LPG) సిలండర్ల వాడకం తగ్గించేందుకు చర్యలు
- పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పైప్‌లైన్ గ్యాస్
- ఇప్పటికే వలిగొండ వద్ద మేఘా సంస్థ ప్లాంట్ ఏర్పాటు
- మొదటి దశలో నల్లగొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కనెక్షన్లు
- 65 వేల ఇళ్లకు వీలైనంత త్వరగా కనెక్షన్లు
- 24 గంటల్లో పైప్‌లైన్ పనులకు పర్మిషన్ ఇవ్వాలని సర్కార్ ఆర్డర్స్
- జిల్లా అధికారులకు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అనేక రంగాల పైన తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చమురు కొరత కారణంగా వంట గ్యాస్ సిలండర్లకు తీవ్రమైన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎన్పీజీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) గ్యాస్ ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. దేశంలో 2010లో గుజరాత్ లో మొదలైన ఎన్పీజీ(NPG) వ్యవస్థ కాలక్రమేణ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. దీనిలో భాగంగా మున్సిపాలిటీల్లో ఎన్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని, అందుకు అవసరమయ్యే అనుమతులన్నీ 24 గంటల్లోగా మేఘా సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో నల్లగొండ, చిట్యాల మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. నల్లగొండలో పైలెట్ ప్రాజెక్టు కింద వెంకటేశ్వరకాలనీలో (VT కాలనీలో) ఎప్పుడో ఎన్పీజీ కనెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.500లకే గ్యాస్ సిలండర్లు ఇస్తుండటంతో ఎన్పీజీకి డిమాండ్ పడిపోయింది. దాంతో ఎన్పీజీ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సైతం వెనక్కి తగ్గారు. మహాలక్ష్మీ స్కీం ప్రకటించగానే పీఎన్జీ కనెక్షన్లు పెట్టుకున్న వినియోగదారులు సైతం రద్ధు చేసుకున్నారు. దాంతో మేఘా సంస్థ పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం తగ్గించింది. మళ్లీ ఇప్పుడు ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోవడంతో దేశ వ్యాప్తంగా సిలండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా వంట గ్యాస్, వాణిజ్య సముదాయాలకు వినియోగించే సిలండర్ల సప్లై తగ్గింది. దాంతో మళ్లీ పీఎన్జీ గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది.

రెండు మున్సిపాలిటీల్లో 65 వేల ఇళ్లు…
నల్లగొండలో 60 వేలు, చిట్యాల మున్సిపాలిటీలో 5 వేల ఇళ్లు ఉన్నాయి. దీంట్లో నల్లగొండలోని వీటీ కాలనీలో 404 మంది రిజిస్టర్ చేసుకోగా, 200 ఇళ్లకు పీఎన్జీ సప్లై అవుతోంది. వలిగొండ మండలం వద్ద పీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భూగర్భం గుండా పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 90 కిలోమీటర్లకు గాను 26 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. పైప్‌లైన్ వేయడానికి అన్ని శాఖల అనుమతులు ఇవ్వడం ఆలస్యమవుతోంది. ఇప్పుడు వంట గ్యాస్ కు కొరత ఏర్పడిన నేపథ్యంలో సంబంధిత శాఖల నుంచి 24 గంటల్లోగా పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్(RWS), మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో కిలో మీటర్ కు మేఘా సంస్థ రూ.10 లక్షలు సంబంధిత శాఖలకు డిపాజిట్ చేయగానే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పైప్‌లైన్ వేసేందుకు తక్షణమే పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. చిట్యాలలో పైప్‌లైన్ వేసేందుకు స్థానికంగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యం లో కలెక్టర్ ఆదేశాలతో పీఎన్జీ పనులు వేగవంతమవుతాయని అధికారులు తెలిపారు.
పైప్‌లైన్ పనులు జరిగే క్రమంలో రోడ్లు, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, చెట్లు తొలగించాల్సి వస్తది. రోడ్లు, పైప్లైన్లు ధ్వంసమైన చోట్ల మేఘా సంస్థ మళ్లీ తిరిగి నిర్మించాలి. దీని కోసం డిపాజిట్ రూపంలో సంబంధిత శాఖలకు రూ.10 లక్షలు జమ చేయనుంది. పీఎన్జీ పైప్‌లైన్ వేయగానే తవ్విన ప్రదేశాల్లో మరమ్మత్తులు చేయకపోతే డిపాజిట్ చేసిన పది లక్షలు సంబంధిత శాఖలు తిరిగి చెల్లించదు. ఆ డబ్బులతోనే డిపార్ట్మెంట్లు రిపేర్లు చేయాలి. సాధారణ జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సెప్టెంబర్ 30 లోగా పీఎన్జీ పైప్‌లైన్ వర్క్స్ కంప్లీట్ చేయాలి. పనులు జరిగే ప్రాంతాల్లో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది.
రీచార్జ్ ద్వారా గ్యాస్ సప్లై…
మొబైల్ ఫోన్లో టాక్ టైం రీచార్జి చేసుకున్నట్టుగానే పీఎన్జీ గ్యాస్ కోసం ముందుగా రీచార్జ్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి మీటర్ బిగిస్తారు. కస్టమర్ల ఫోన్లలో మేఘా గ్యాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో కనెక్షన్ల వివరాలు, రీచార్జి చేసుకున్న డబ్బుల వివరాలు కనిపిస్తాయి. గ్యాస్ ఎంత వాడుకుంటున్నామనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. రీచార్జ్ చేసుకోమని ముందుగానే అలెర్ట్ మేసేజ్‌లు వస్తాయి. ఈ గ్యాస్ వాడకం వల్ల ఎలాంటి ప్రాణహానీ ఉండదు. ప్రమాదాలకు ఆస్కారం లేదు. మంట కూడా వేగంగానే వస్తుంది. ‘మెగా సిటీ గ్యాస్ ప్రాజెక్టు వలిగొండ నుండి నార్కట్‌పల్లి వరకు విస్తరించి ఉంది. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ట్యాంక్ పాయింట్ ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి నుండి నల్గొండ వరకు పైప్‌లైన్ ద్వారా 5 గ్రామాలను కలుపుతూ టాప్ అప్ పాయింట్స్ ఏర్పాట్లు జరుగుతన్నాయి.
పీఎన్జీకి మారేందుకు చర్యలు…
వాణిజ్య, పారిశ్రామి, గృహా వినియోగదారులు ముందుగా OMCల వద్ద నమోదు చేసుకోవాలి. సంబంధిత సిటీ గ్యాస్ సంస్థ వద్ద పీఎన్జీ కోసం అప్లై చేసుకోవాలి. PNGకి మారేందుకు 50 శాతం వరకు వాణిజ్య LPG కేటాయింపుకు అర్హత ఉంటుంది. దీర్ఘకాలికంగా PNG వాడకాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పిజి కేటాయింపును 20 శాతం నుండి 50 శాతం వరకు పెంచారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర నోడల్ అధికారిగా, డీఎస్ఓ(DSO) PNG, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) మధ్య సమన్వయం కోసం నియమించారు.