- ఖమ్మం ఘటనతో నల్లగొండ పట్టణంలోని భూముల పైన అనుమానాలు
- బోగస్ సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ ?
- రియల్టర్లకు అమ్మేసిన ఆక్రమణదారులు
- వాటినే ప్లాట్లుగా మార్చి సొమ్ముచేసుకున్న రియల్టర్లు
- సర్వే నంబర్లు 425 నుంచి 435లో సుమారు 20 ఎకరాలు
- బీఆర్ఎస్ హయంలోనే జరిగిన భూదందా
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్లో విలువైన భూదాన భూములు మాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మంలోని వెలుగుమట్ల లో వెలుగు చూసిన ఉదంతం తరహాలోనే నల్లగొండలో కూడా వందల కోట్ల విలువైన భూదాన భూములను రియల్టర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ భూదందా గురించి ఖమ్మం ఘటన నేపథ్యంలో తెరపైకొచ్చింది. ఖమ్మంలోని వెలుగుమట్ల లో వందల కోట్లు విలువచేసే 32 ఎకరాల భూమిని కొందరు దళారులు కాజేశారు. సుమారు రూ.250 కోట్ల విలువచేసే భూములకు నకిలీ పత్రాలు సృష్టించి ఆరు లక్షలకే జనాలకు అంటగట్టారు. ఆ భూముల్లో కట్టుకున్న గుడిసెలను, ఇళ్లను అధికారులు కూల్చేయడం తో ఇప్పుడు అందరి దృష్టి నల్లగొండలోని భూదాన భూముల పైన పడింది. ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో వెలుగుమట్ల అక్రమాలు బయటపడ్డాయి. అయితే ఖమ్మంలో మాదిరే నల్లగొండలో కూడా సుమారు 20 ఎకరాల భూదాన భూములను రియల్టర్లు బోగస్ సర్వే నంబర్లతో కాజేసినట్టు తెలిసింది.
20 ఎకరాల భూమి ఎక్కడా..?
ప్రస్తుతం అవుట్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో భూదాన భూములు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తు ల ఆధీనంలో ఉన్న ఈ భూములను బీఆర్ఎస్ హాయాంలోనే చేతులు మారాయి. సర్వే నంబర్లు 425 నుంచి 435లో సుమారు 20 ఎకరాలు ఉన్నట్టు అప్పటి రెవిన్యూ అధికారులు తేల్చారు. ధరణి వెబ్సైట్లో ఈ భూములను బ్లాక్లిస్ట్లో పెట్టారు. అధికార బలం అండతో నిషేదిత జాబితా నుంచి ఈ భూములను తొలగించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి, కానీ అందుకు అప్పుడున్న రెవిన్యూ ఆఫీసర్లు ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో ఏకంగా సర్వే నంబర్లు చేంజ్ చేశారు.
రియల్ ఎస్టేట్ జోరుగా ఉండటంతో…
బీఆర్ఎస్ హాయాంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉండటంతో అప్పటి లీడర్ల కన్ను ఈ భూముల పైన పడింది. అప్పుడున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సైతం భూధాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మొదట్లో ఘాటుగానే స్పందించారు. కానీ ఆ తర్వాత ఆ భూముల్లో సొంత పార్టీ లీడర్ల ప్రమేయం కూడా ఉందని తేలడంతో వెనక్కితగ్గినట్టు అప్పట్లు ఆరోపణలు వచ్చాయి. నిషేదిత జాబితా నుంచి తొలగించకపోవడంతో రియల్టర్లు బోగస్ సర్వే నంబర్లు సృష్టించి ప్లాట్లుగా మార్చారు.
ఈ ప్రాంతాల్లోనే భూములు…
నల్లగొండ పట్టణ శివారు ప్రాంతంలోని సూర్యానగర్, రాక్ హిల్స్, కలెక్టరేట్ వెనక భాగంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో భూదాన భూములు ఉన్నాయని బీఆర్ఎస్ హయాంలో రెవిన్యూ ఆఫీసర్లు గుర్తించారు. బ్లాక్లిస్ట్లో ఉన్న సర్వే నంబర్లు తొలగించేందుకు అప్పటి ఆఫీసర్లు ఒప్పుకోకపోవడంతో బోగస్ ఇంటి నంబర్లతో భూములను మాయం చేసేందుకు పథకం పన్నారు. భూదాన భూములు ఆధీనంలో ఉన్న పట్టేదారుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవే ఇంటి నంబర్లు, భూముల సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేశారు. వీటినే ప్లాట్లుగా మార్చి జనాలకు అంటగట్టారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖమ్మం తరహాలోనే నల్లొండ భూముల పైన కూడా అధికారులు విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.