- జనరల్ బాడీ జరగకుండా.. క్లబ్ గేట్ కు తాళం వేసిన అధ్యక్ష, కార్యదర్శులు
- గత్యంతరం లేక ఖాళీ జాగలో నిర్వహించిన మీటింగ్
- క్లబ్లో మితిమీరిన ‘నేతి’ అనుచరుల ఆగడాలు
- 2019 నుంచి మీటింగ్ల్లేవ్… లెక్కపత్రాలు గల్లంతు
- ఎట్టకేలకు కొత్త కార్యవర్గం ఎన్నిక… ఎమ్మెల్యే వీరేశం విషెస్
- అధ్యక్షు, కార్యదర్శుల పైన చర్యలకు ఏకగ్రీవ తీర్మానం
నకిరేకల్, ఏపీబీ న్యూస్: నకిరేకల్ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులకు ఘోరమైన అవమానం జరిగింది. గత ఏడేళ్ల నుంచి క్లబ్ జనరల్ బాడీ పెట్టకుండా, లెక్కలు చూపించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న అధ్యక్షుడు పార్ధసారధి, జనరల్ సెక్రటరీ నాయిని మధు చర్యలకు వ్యతిరేకంగా క్లబ్ కార్యవర్గం ఏకతాటిపైకొచ్చింది. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని కార్యవర్గం ఎన్నిసార్లు కోరినప్పటికీ అధ్యక్ష, కార్యదర్శులు పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ అండంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. గతంలో ఇదే పార్ధసారధి రిటైర్డ్ ఉద్యోగి సోమయ్యను ఓ ఫంక్షన్ హాల్లో దాడి చేశారు, దీని పైన కేసుపెట్టేందుకు నకిరేకల్ ఫెన్షన్ల సంఘం గట్టిగానే పోరాడింది. కానీ నేతి విద్యా సాగర్ అండ చూసుకుని సోమయ్య దాడి కేసును పోలీసులు నీరు గార్చారు. గత ఏడేళ్ల నుంచి పార్ధసారధి, నాయిని మధు వైఖరి నచ్చని క్లబ్ కార్యవర్గం జనరల్ బాడీ పెట్టాలని, లెక్కలు చూపించాలని కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహారించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించిన క్లబ్ కార్యవర్గం 118 మందితో సభ్యత్వం నమోదు చేయించింది. ఆదివారం జనరల్ బాడీ నిర్వహించి కొత్త కార్యవర్గం ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కంగుతిన్న అధ్యక్ష, కార్యదర్శులు ఈ నెల 8న జనరల్ బాడీ మీటింగ్ పెడ్తామని కౌంటర్ గా మరో ప్రకటన జారీ చేశారు. అంతటితో ఆగకుండా ఆదివారం జనరల్ బాడీ జరగొద్దని ఏకంగా క్లబ్ గేట్ కు తాళం వేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, రిటైర్డు ఉద్యోగులు సభ్యులుగా ఉన్న క్లబ్ గౌరవాన్ని అవమానించే రీతిలో అధ్యక్ష, కార్యదర్శులు వ్యవహారించిన తీరు విమర్శలకు దారితీసింది. మెయిన్ గేట్ కు తాళం వేయడంతో మరో గత్యంతరం లేక కార్యవర్గ సభ్యులు గోదాం పక్కనే ఉన్న క్లబ్ ఖాళీ జాగలో టెంట్లు వేసుకుని సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యవర్గంలో 95 శాతం మంది సభ్యులు కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకన్నారు. గత ఏడేళ్ల నుంచి మీటింగ్లు పెట్టకుండా, లెక్కలు చూపించకపోవడంతో పార్ధసారధి, మధు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లబ్ కొత్త అధ్యక్షుడిగా మారపాక నర్సయ్య, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ఆనంద్ బాబు, కార్యదర్శి పన్నాల రామిరెడ్డి, కోశాధికారి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందనలు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, రిటైర్డ్ ఎంఈఓ(MEO) పోతుల మల్లయ్య, ఏవీఎం(AVM) స్కూల్ అధినేత పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.