APB News Exclusive: నకిరేకల్ మున్సిపాల్టీకి బంపర్ ఆఫర్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ మున్సిపాలిటీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల 6తో ముగియనుంది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైన రావొచ్చు, దాంతో ఇప్పటి నుంచే ఆశావహుల కోసం రాజకీయ పార్టీలు వెతుకులాడుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. 20 వార్డులు ఉన్న నకిరేకల్లో సగటున ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టారు. చైర్మన్ అభ్యర్థికి ఏకంగా రెండు కోట్ల ఖర్చు వచ్చింది. అప్పడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద రూ.4కోట్లు ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు పెట్టిన ఈ ఐదేళ్లలో అభ్యర్థులకు వచ్చిన నిధులు కేవలం రూ.13 లక్షలే. ఈ నిధులు సీసీ రోడ్లు, మురుగుకాల్వల రిపేర్లకే చాల్లేదు. వార్డుల్లో ఓట్లు వేసిన జనాలు రోడ్ల కోసం, వీధి లైట్ల కోసం కౌన్సిలర్ల ను ప్రాధేయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిచాలదన్నట్టు అప్పుడున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల మధ్య ఎప్పుడూ గొడవలే.

ఎమ్మెల్యే గ్రాంట్స్ కింద వచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డులకే మంజూరు చేశారు. దాంతో నిధుల కోసం మున్సిపల్ మీటింగ్లో కౌన్సిలర్లకు, అధికారులకు మధ్య ఎప్పుడూ వాదోపవాదాలే. ఈ మధ్యలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ పాలకవర్గాన్ని అర్ధాంతరంగా గద్దెదింపారు. ఈ రెండేళ్ల లో రెండు, మూడు మీటింగ్లు తప్పా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి శూన్యం. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. రోడ్ల పైనే ప్రైవేటు వాహనాలు, వీధి వ్యాపారులు, కూరగాయాల బిజినెస్లతో ట్రాఫిక్ అదుపుతప్పింది. ఎవరైన నోరు తెరిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఎమ్మెల్యే పేరును అడ్డంగా వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఏమీ చేయలేని నిస్సాయహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకొందరు ఏకంగా పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు.

మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ కు రిజర్వు అయ్యింది. తొలి ఎన్నికల్లో బీసీలకు రిజర్వ్ అయినప్పుడు ఎన్నికల ఖర్చు కోట్లు దాటింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వీరేశాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి కోట్లు కుమ్మరించారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నకిరేకల్ పట్టణంలో అప్పుడు పార్టీ గెలుపు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి బీఆర్ఎస్లోకి మారడంతో నకిరేకల్లో కాంగ్రెస్ కేడర్ చెల్లాచెదురైంది. దాంతో వీరేశం మరింత పట్టుబిగించారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన అనుచరులను బరిలో దింపారు. 20 వార్డుల్లో బీఆర్ఎస్ 12 గెలిస్తే, వీరేశం వర్గం 6 వార్డులు, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. బీఆర్ఎస్ మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కౌన్సిలర్లు ప్లేట్ పిరాయించారు, దాంతో మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు బెంబెలెత్తుతున్నారు.

ఆలసించిన ఆశాభంగం… నకిరేకల్ మున్సిపల్ చైర్మన పీఠం ఆశిస్తున్న వాళ్లు రెండు కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారే ముందుకు రావాలని ప్రధాన పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. ఒక్కో వార్డుకు కనీసం పది లక్షల చొప్పున 20 వార్డులకు రూ.2కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారో చైర్మన్ పీఠం వాళ్లదేనని ప్రచారం చేస్తున్నారు. నకిరేకల్ కాంగ్రెస్ కు రెడ్డి సామాజికవర్గం అండగా నిలిచింది. వీళ్లతో గౌడ, పద్మ శాలి, మున్నూరుకాపు, వైశ్యులు, ఎస్సీలు, మైనార్టీల్లో మెజార్టీ కాంగ్రెస్ పక్షానే ఉన్నారు, కానీ రెండు కోట్లు అనే సరికి రెడ్డి లీడర్లతో పాటు, వైశ్యులు ఆలోచిస్తున్నారు. నకిరేకల్ మండలంలోని వెలమ లీడర్లను మున్సిపాలిటీలో దింపాలనే ఆలోచన కూడా జరుగుతోంది. ధైర్యం చేసి రెండు కోట్లు ఖర్చు పెట్టినా, గత ఐదేళ్లలో మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం, కౌన్సిలర్లకు వచ్చిన నిధులు పరిశీలిస్తే పొంతనలేకుండా పోయింది. ఇటీవల జరిగిన చివరి బడ్జెట్ మీటింగ్లో మున్సిపల్ సిబ్బంది వేతనాలు పెంచాలని తీర్మానించారు. వచ్చే ఆదాయం ఏడాదికి రూ.3 కోట్లు ఉంటే ఖర్చులు అంతకు మించి ఉన్నాయి. పైగా మున్సిపాలిటీ పైన ఎమ్మెల్యేలదే పెత్తనం. చైర్మన్లు, కౌన్సిలర్లు అలంకారప్రాయంగానే ఉండాల్సిన పరిస్థితి. గత ఐదేళ్ల కాలంలో కౌన్సిలర్లుగా చేసిన అభివృద్ధి కంటే తమ పదవులు కాపాడుకునేందుకు, ఎన్నికల ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు పార్టీలు మారడం తప్పా చెప్పొదగ్గ పనులేమీ చేయలేదు. దాంతో కౌన్సిలర్లుగా నిలబడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.

Share
Share