- ఐదేళ్ల పాలనలో మారని పట్టణ రూపం
- అవే మురికికూపాలు, అధ్వాన్నమైన రోడ్లు
- మూడేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 90 కోట్లు,
- రెండున్నరేళ్ల కాంగ్రెస్ హయాంలో రూ.15 కోట్లు
- కానీ జాడలేని అభివృద్ధి… మధ్యలోనే ఆపేసిన వర్క్స్
- ముగిసిన పాలకవర్గం చివరి బడ్జెట్ సమావేశం
- మే 6తో పాలకవర్గం పదవీకాలం పూర్తి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలతో నకిరేకల్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మారింది. అవే మురికికూపాలు, అద్వాన్నమైన రోడ్లు తప్పా ఐదేళ్లలో పట్టణ రూపురేఖల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నల్లగొండనే ఆదర్శంగా తీసుకుని అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగమేఘాల మీద ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పాలకవర్గం పదవీ కాలం మూడేళ్లు కాగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిరేకల్ రాజకీయం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్న కౌన్సిలర్లు అధికారం మారడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నకిరేకల్‌లో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించొద్దనే లక్ష్యంతో ‘చిరుమర్తి’ పేరుతో ఉన్న శిలాఫలాకలు తొలగించి కాంగ్రెస్ శిలాఫలాకాలు వేయడం తప్పా అభివృద్ధి మాత్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. పైగా బీఆర్ఎస్ హాయంలో మొదలు పెట్టిన పనులన్నీంటిని మధ్యలోనే ఆపేశారు. 70 శాతం పూర్తియిన పనులు కూడా కంప్లీట్ చేయకుండా రద్ధు చేశారు. పొరుగునే ఉన్న తిరుమలగిరి లాంటి చిన్న మున్సిపాలిటీల్లో జరిగినంత అభివృద్ధి కూడా నకిరేకల్‌లో చేపట్టకపోవడం గమనార్హం.

90 కోట్ల బీఆర్ఎస్ పనులన్నీ రద్ధు..!
బీఆర్ఎస్ హయాంలో సుమారు రూ.90 కోట్లతో మొదలు పెట్టిన పనులన్నీ కాంగ్రెస్ పాలకవర్గం ఆపేసింది. రూ.32 కోట్లతో చేపట్టిన గవర్నమెంట్ ఆసుపత్రి బిల్డింగ్ బీఆర్ఎస్ హాయంలోనే శంకుస్థాపన చేశారు. మొదలు పెట్టిన రెండున్నర ఏళ్లలోనే బిల్డింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది, కానీ రాజకీయ విభేదాల వల్ల ఇప్పటి వరకు బిల్డింగ్ ఓపెన్ కాలేదు. టౌన్లో రూ.26 కోట్లతో ప్రధాన రహాదారి వెడల్పు చేశారు. 70 శాతం పనులు కంప్లీట్ చేయగా, ఇంకా 30 శాతం పనులు పెండింగ్‌లో పెట్టారు. డ్రైనేజీల పైన మూతలు బిగించడం, ఇందిరా గాంధీ విగ్రహాం వద్ద జంక్షన్ ఏర్పాటు, డివైడర్లకు రంగులు వేయడం, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సీసీ రోడ్లు వేయాల్సి ఉంది. కాంగ్రెస్ పాలకవర్గం కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పనులు మధ్యలోనే వదిలేశారని తెలిసింది. రూ.4కోట్లతో బ్రహ్మంగారి గుడి చెరువు వద్ద చేపట్టిన మినీట్యాంకు బండ్ నిర్మాణం పనులు రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టారు. కోటి రూపాయాలతో షాదీఖానా బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.2కోట్లతో దోబీఘాట్, రూ.4కోట్లతో వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్ పనలకు అప్పటి పాలకవర్గం శంకుస్థాపన చేయడంతో పాటు, 50శాతం మార్కెట్ పనులు కూడా పూర్తిచేశారు. అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి ముందు శాంక్షన్ చేసిన రూ.16 కోట్లను పాలకవర్గం చేతులు మారక తలా ఇంత పంచుకోవడం తప్పా పనులు మాత్రం చేయలేదు.
రెండేళ్లలో డీపీఆర్‌లు… టెండర్లే
పాలకవర్గం చేతులు మారిన రెండేళ్లలో డీపీఆర్‌లు, చేపట్టాల్సిన పనులు ఇంకా టెండర్ల దశలో ఉన్నాయని చెప్పడం తప్పా కార్యరూపం దాల్చిన పనులు లేవనే చెప్పాలి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి రూ.24.90 కోట్లతో డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) రూపొందించారని నివేధికలో పేర్కొన్నారు. అమృత్ స్కీంలో భాగంగా కాలం వారి కుంటను పునరుద్ధరించేందుకు రూ.2.04 కోట్లతో టెండర్లు పూర్తియ్యాయని చెప్తున్నారు. అర్భన్ డెవలప్మెంట్ పథకం కింద అన్ని వార్డుల్లో మురుగు కాల్వలు నిర్మించేందుకు రూ.6.30 కోట్లతో మొదలు పెట్టిన పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయని చూపిస్తున్నారు. ఈ ఫండ్స్ బీఆర్ఎస్ హాయాంలో వచ్చినవే. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలోని అన్న మున్సిపాలిటీలకు ఇచ్చినట్టుగానే నకిరేకల్‌కు రూ.15 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. సీసీ రోడ్లకు రూ.10 కోట్లు, డ్రైనేజీలకు రూ.5 కోట్లతో ప్రతిపాధనలు సిద్ధం చేశారు. టెండర్లు పిలిచి పనులు మొదలు పెడితే అప్పుడు ఫండ్స్ రిలీజ్ అవుతాయి, కానీ పాలకవర్గం గడువు మరోనెల రోజుల్లో ముగియనుంది. ఇంత తక్కువ టైంలో ఇన్ని కోట్ల పనులు ఏవిధంగా చేపడ్తారనేది ప్రశ్నార్ధకం.

ముగిసిన చివరి బడ్జెట్ మీటింగ్…
పాలకవర్గం చివరి బడ్జెట్ సమావేశం శనివారం ముగిసింది. 2026-27కు గాను రూ.36 కోట్లతో బడ్జెట్ ఆమోదించారు. దీంట్లో ఇంటి పన్నులు ద్వారా వచ్చే ఆదాయం రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఇదంతా సిబ్బంది వేతనాలకే సరిపోతుంది. ఇంటి నంబర్లు డబుల్ ఉండటం వల్ల నిర్ధేశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు కావడం లేదు. రూ.3 కోట్ల ట్యాక్సీ వసూలు చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ బోగస్ ఇంటి నంబర్లు వేయడం వల్ల ఆదాయం ఎక్కువగా కనిపిస్తోంది.
పక్కా భవనం లేక ఇక్కట్లు..
మున్సిపాలిటీకీ ఇప్పుడున్న బిల్డింగ్ ఏమాత్రం చాలడం లేదు. చెత్త బండ్లు పెట్టుకునేందుకు కూడా స్థలం చాలకపోవడంతో ఐబీ బిల్డింగ్ వాడుకుంటున్నారు. నిజానికి గవర్నమెంట్ ఆసుపత్రి బిల్డింగ్ ఓపెన్ అయితే పాత ఆసుపత్రి బిల్డింగ్‌ను మున్సిపాలిటీకి వాడుకోవచ్చని పాత పాలకవర్గం భావించింది. 20 వార్డులకు నాలుగు చెత్త ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి, ఇంకో ఆరు బండ్లు కావాల్సి ఉంది. ట్రాక్టర్లు లేకపోవడం వల్ల చెత్త తరలించడం సమస్యగా మారింది. మున్సి పాలిటీలో పశు వైద్యశాల బిల్డింగ్ లేదు. డిగ్రీ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ రూ.3 కోట్లతో అప్పటి పాలకవర్గం కోర్టు దగ్గర శిలాఫలకం వేసింది.