మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరోసారి నిరూపించుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చండూరు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చండూరు పట్టణంలో నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి పాల్గొన్నారు. కార్యకర్తల కోలాహలం, బాణసంచా మోతలతో చండూరు పురవీధులు మారుమోగాయి.

ప్రజలను కడుపులో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ర్యాలీ అనంతరం జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి గారు భావోద్వేగంగా ప్రసంగించారు. రాబోయే మూడేళ్లలో చండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. పార్టీపై, అభ్యర్థులపై నమ్మకంతో గెలిపించిన ఓటర్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గత పాలకులలాగా భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ఇక్కడ తావులేదు. గెలిచిన కౌన్సిలర్లంతా ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటారు.
మునుగోడు – పులివెందుల: కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో, నాకు మునుగోడు ప్రజలు అలాగే. ఈ నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను. పట్టణంలోని ఇళ్లు లేని పేదలను గుర్తించి, ఒక్కో వార్డుకు 50 మంది చొప్పున ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టించి ఇస్తాం. యువత మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకోకుండా వారిని కాపాడే బాధ్యత నాపై ఉంది.
మిత్రపక్షాల విజయం: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ఈ విజయం కాంగ్రెస్-సీపీఐ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యూహంతో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు కలిసి పోటీ చేసి చండూరును కైవసం చేసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం వినూత్నంగా ఆలోచిస్తారని, ఆయన నాయకత్వంలో మునుగోడు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.