- మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లబ్ధిపొందడం పైనే ఇరుపార్టీల ఫోకస్
- రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం 234 వార్డుల్లో కాంగ్రెస్ హవా
- 136 వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ 19 వార్డులకే పరిమితం
- బలమైన అభ్యర్థులు లేక బీఆర్ఎస్ సతమతం
- మతం ఓట్ల పైనే బీజేపీ గురి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో ఆసక్తిరేపుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పట్టణాల్లో తమ బలాన్ని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా బీఆర్ఎస్ బాకీ కార్డుతో ప్రచారం చేస్తుండగా, బీజేపీ మతం ప్రాతిపధికన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 17 మున్సిపాలిటీల్లో 407 వార్డుల్లో కాంగ్రెస్ 394, బీఆర్ఎస్ 372, బీజేపీ 338 వార్డుల్లో పోటీ చేస్తోంది. అయితే కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్థులు బీఆర్ఎస్లో లేకపోవడంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత పైనే ఆధారపడి ప్రచారం చేస్తోంది. గత పదేళ్లలో మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి, ఈ రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అర్బన్ పార్టీగా పేరొందిన బీజేపీ మాత్రం ఒక వర్గం ఓటర్ల పైనే నమ్మకం పెట్టుకుంది. మైనార్టీ ఓటర్లు ప్రభావితం చూపే నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యా పేట, భువనగిరి, చౌటుప్పుల్ మున్సిపాలిటీల్లో మాత్రం ట్రయాంగిల్ వార్ నడుస్తోంది.
అనుకూల… ప్రతికూల అంశాలు ఇవే
ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అనుకూల, ప్రతికూల అంశాలే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేయనున్నాయి. మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు పట్టణ ఓటర్లు మొగ్గు చూపుతారని ఆపార్టీ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్, బీజేపీ చీల్చుకుంటే అంతిమంగా కాంగ్రెస్‌కే మేలు జరుగుతుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంతో మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కే పడ్తాయని నమ్ముతోంది. బీఆర్ఎస్ గత పదేళ్లలో మున్సిపాలిటీల్లో సాధించిన ప్రగతి పైనే నమ్మకం పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీకి పట్టణాల్లో యువకులు, మహిళలు, ఉద్యోగులు, మేధావుల ఆధరణ ఉంటదని ఆ వర్గం ఓటర్ల పైన ఫోకస్ పెట్టారు.
బలమైన అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పాట్లు
ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో గట్టెక్కేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థులను వెంటబెట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయోద్దని ఆలోచనతో అన్ని చోట్ల నామినేషన్లు అయితే వేశారు కానీ వాళ్ల లో చాలా మంది కొత్తవాళ్లు కాగా, మరికొన్ని చోట్ల గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటదని నమ్మి వాళ్లనే బరిలో దింపారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన చేదునుభవాల దృష్ట్యా ఎమ్మెల్యేలు ఈసారి జాగ్రత్త పడ్డారు. కోదాడ, హుజూర్నగర్, హాలియా నందికొండ, చౌటుప్పుల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేట, మిర్యాలగూడెం, తిరుమలగిరి, మోత్కూరు, చిట్యాల, చండూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌తో గట్టిగానే పోటీ పడుతోంది. బీజేపీలో బలమైన నాయకత్వం లేకపోవడంతో అభ్యర్థులు వెనకబడ్డారు.
రాజకీయ విశ్లేషకుల అంచనాలు
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం మొత్తం 407 వార్డుల్లో కాంగ్రెస్ 234, బీఆర్ఎస్ 136, బీజేపీ 19 వార్డుల్లో ప్రభావం కనిపిస్తోంది. మొత్తం 389 వార్డుల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అన్ని చోట్ల కాంగ్రెస్ మెజార్టీ కనిపిస్తోంది. మిర్యాలగూడ, చండూరు, మోత్కూరు, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. పాలకవర్గాలు కైవసం చేసుకునేందుకు మెజార్టీ చాలకుంటే ఎంపీ(MP), ఎమ్మెల్యే(MLA), ఎమ్మెల్సీ(MLC) ఎక్స్ ఆఫిషియో(Ex Officio) ఓట్లతో గట్టెక్కేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. చండూరు మున్సిపాలిటీల్లో నాలుగు వార్డులు గెలిస్తే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లను వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. నల్లగొండ కార్పోరేషన్లో కాంగ్రెస్ 30 డివిజన్లలో గెలుపు సంకేతాలు కనిపిస్తున్నాయి. కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ సంఖ్యలో గెలవనున్నారు.