Breaking News: మున్సిపల్​ ఎన్నికల్లో కోట్లు కుమ్మరిస్తున్న అభ్యర్థులు…ఏరులై పారుతున్న మద్యం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటా పోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు అభ్యర్థులను వెంట బెట్టుకుని గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఇక మంత్రులు రోడ్షో లు, మీటింగ్ లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులు నిలబడిన చోట ఖర్చుకు ఏమాత్రం వెనకడాటం లేదు. కొన్ని చోట్ల జనరల్ వార్డుల్లో సైతం బీసీలను నిలబెట్టడంతో కౌంటర్గా బీఆర్ఎస్, బీజేపీ అగ్ర వర్ణాల అభ్యర్థులను బరిలో దింపాయి, అలాంటి వార్డుల్లో ఎన్నికల ఖర్చు అదుపు తప్పుతోంది. బీసీలు నిలబడిన చోట అభ్యర్థులు పోటా పోటీగా ఉన్న వార్డుల్లో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నెల 3 తేదీ నుంచి పట్టణాల్లో ప్రచారం మార్మో మోగుతోంది. ప్రచార రథాలు మోగిస్తున్న సౌండ్లతో పట్టణవాసులు బెంబెలెత్తి పోతున్నారు. కొందరు మహిళలు రోజువారి కూలిగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల తరపున కరపత్రాలు పంచి పెడుతూ వాల్ పోస్టర్లు అతికిస్తున్నారు.

ఎన్నికల ఖర్చు పెట్టడంలో ప్రధాన పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా జనరల్, జనరల్ మహిళలు పోటీ చేస్తున్న వార్డుల్లో ఖర్చు రూ.50లక్షల వరకు వస్తోంది. చైర్మ్న్, మేయర్ అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.70లక్షల వరకు వెనకడాట్లేదు. మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట లాంటి మేజర్ మున్సిపాలిటీలకు ధీటుగా త్రిటైర్(3-tier) మున్సిపాలిటీలు చిట్యాల, చండూరు, మోత్కూరు, హాలియా, నంది కొండ లాంటి మున్సిపాలిటీల్లో సైతం అదరిపోయే ఖర్చు పెడుతున్నారు.

నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ఒక జనరల్ డివిజన్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యారు. కాంగ్రెస్ తరపున బీసీ, బీజేపీ నుంచి రెడ్డి అభ్యర్థి నిలబడిన డివిజన్లో మరొక అభ్యర్థి ఫ్వారర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. ఈ డివిజన్ నల్లొండలో హాట్కేక్గా మారింది. బీజేపీ అభ్యర్థి జిల్లా కీలక నేత సమీప బందువు కాగా, బీజేపీ టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీచేస్తున్న రెబల్ అభ్యర్థి ముఖ్యమైన బీసీ నేత, ఈ వార్డులో రెడ్డి వర్గం ఓటర్లు బలంగా ఉన్నారు, దీంతో ఈ డివిజన్ కైవసం చేసుకునేందుకు ముగ్గురు పోటాపోటీగా ఖర్చు పెట్టాలని డిసైడయ్యారు. అవసరమైతే ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకూ సిద్ధమైనట్లు తెలిసింది. ప్రచారం కోసం రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు పెడుతున్నారు.

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీ గా ఖర్చు పెడుతున్నారు. దినసరి కూలీలకు ఉదయం టిఫిన్తో పాటు, మధ్యాహ్నాం చికెన్ బోజనం పెడుతున్నారు. ఓటుకు రూ.2వేలు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జనరల్ స్థానాలు బీసీలు, ఎస్సీలకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే, బీఆర్ఎస్ రెడ్డి, ఇతర కులాల అభ్యర్థలను నిలబెట్టారు. దీంతో చిట్యాలలో ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేసేందుకు మహిళలు, యువకులు, కుల సంఘాలతో మీటింగ్లు పెడుతున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో ఒక మగ ఓటు ఉంటే క్వార్టర్, రెండు మగ ఓట్లు ఉంటే హాఫ్ బాటిల్ పంపిణీ చేస్తున్నారు. అధికార బలంలో పంపిణీ చేయకుండా అడ్డుకుంటారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుగానే లిక్కర్ పంపిణీ చేయడం మొదలు పెట్టారు.

17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్ కలిపి మొత్తం 427 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో బీసీలకు 124, జనరల్, జనరల్ మహిళలకు 216, ఎస్సీలు, మహిళలకు 60, ఎస్టీలు, మహిళలకు 27 వార్డులు కేటాయించారు. బీసీ వార్డుల్లో ఒక్కో వార్డుకు సగటున రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 124 వార్డులకు 49కోట్ల 60 లక్షలు కాగా, 216 జనరల్, జనరల్ మహిళల వార్డుల్లో రూ.50లక్షలు దాకా ఖర్చు అవుతుంది. 216 వార్డుల్లో ఒక్కోదానికి రూ.50లక్షలు అనుకుంటే సుమారు రూ.108 కోట్లు, బీసీ, జనరల్ వార్డుల ఎన్నికల ఖర్చు రూ.157 కోట్లు కాగా, ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో రూ.17 కోట్ల దాక ఉంటదని రాజకీయ పార్టీలు లెక్కగట్టాయి. మందు సిట్టింగ్లు, నాన్లోకల్ ఓటర్లను తరిలించేందుకు, ఓటర్లకు ఇచ్చే తాయిలాలతో కలిపి మొత్తం రూ.200 కోట్ల వరకు వస్తుందని లెక్కకట్టారు. ఎన్నికలయ్యాక కౌన్సిలర్లను, కార్పోరేటర్లను క్యాంప్కు తరలిస్తే ఆ ఖర్చు చైర్మన్, మేయర్ అభ్యర్థులకు తడిసి మోపవుతుంది. ఈ ఎన్నికల్లో పెట్టిన ఖర్చులో సగం భాగం మేయర్, చైర్మన్ ఎన్నిక సమయం లో రాబట్టుకోవచ్చన్నది అభ్యర్థుల ప్లాన్.

  • అభ్యర్థుల వెంట తిరిగే జనాలకు దినసరి కూలీ ఒక పూటకు రూ.300లు.. రెండు పూటలకు రూ.500
  • ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం భోజనం వెజ్ రూ.10వేలు, చికెన్ భోజనం రూ.20 వేలు
  • సాయంత్రం తాగుడుకు అయ్యే ఖర్చు రూ.10వేలు
  • ప్రతి ఇంటికి ప్రీమియం బ్రాండ్ క్వార్టర్, ఆఫ్ బాటిల్ లిక్కర్
  • ఒక్క ఆటో (చిన్నది) ప్రచారం ఖర్చు రూ.1500, 2వేలు & పెద్ద ఆటోలకు రూ.3 నుంచి రూ.5వేలు
  • మైకులు, డోర్ స్టిక్కర్లు, పాటలకు రూ.50 వేలు
  • ఓటర్లకు జనరల్ వార్డుల్లో రూ.2వేలు, ట్రయాంగిల్ పోటీ ఉన్న వార్డుల్లో రూ.5వేలు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో రూ.1500లు ఓటుకు
  • మొత్తం ఎన్నికల ఖర్చు జనరల్ అభ్యర్థులకు రూ.50 లక్షలు
  • బీసీ, ఎస్సీ అభ్యర్థులకు రూ.35 నుంచి 40 లక్షలు
  • చైర్మన్, మేయర్ అభ్యర్థులు ఉన్న చోట రూ.70 లక్షలు
Share
Share