- జనరల్ సీట్లలో బీసీలకు బెర్త్ దొరికేనా!
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ నెరవేర్చేనా?
- జనరల్ సీట్లలో బీసీలను చైర్మన్లు చేయాలనే డిమాండ్
- 42 శాతం హామీ నెరవేర్చాలంటున్న బీసీ సంఘాలు
- బీసీలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి
- నల్లగొండలో మూడు టర్మ్లు బీసీలకే ఛాన్స్
- మళ్లీ మేయర్ పదవి బీసీ మహిళలకే ఇస్తారనే టాక్
- కోదాడ చైర్మన్‌ను బీసీనే చేయాలనే మంత్రి ఉత్తమ్ ఆలోచన
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపాలిటీల్లో జనరల్కు రిజర్వు చేసిన చైర్మన్ స్థానాల్లో బీసీలకు బెర్త్ దొరుకుతుందా? లేదా? అనేదాని పై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం సీట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే, చట్ట సభల్లో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో పార్టీ పరంగా 42శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి విధితమే, ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఏడు సీట్లు జనరల్కు, జనరల్ మహిళలకు ఏడు చైర్మన్ స్థానాలు రిజర్వు అయ్యాయి. బీసీలకు కేవలం మూడు మాత్రమే కేటాయించారు. 2020 ఎన్నికల్లో బీసీలకు ఏడు మున్సిపాలిటీల్లో దక్కితే ఈసారి మూడు చైర్మన్లే మిగిలాయి. రాష్ట్రం యూనిట్గా చైర్మన్ స్థానాలు రిజర్వు చేయడంతో ఆ మేరకు జిల్లాకు రావాల్సిన కోటా తగ్గింది.
కాంగ్రెస్‌లో రెడ్లదే ఆధిపత్యం
జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఎంపీలు, మండలి చైర్మన్ రెడ్డి సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు కార్పోరేషన్ పదవులు కూడా ఆ వర్గానికే దక్కాయి. జిల్లాలో బీసీల లోటు పూడ్చేందుకు మున్సిపల్ ఎన్నికలే కీలకం. జనరల్, జనరల్ మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో బీసీలకు చైర్మన్ ఛాన్స్ ఇవ్వా లని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు భారీ కోత పడింది. పార్టీల సింబల్స్ లేకుండా జరిగిన ఎన్నికలు కావున అన్ని వర్గాలు పోటీ పడ్డాయి. పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం బీసీ వాదానికి ఎంతవరకు కట్టుబడి ఉందో తేలిపోతుందని బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మేయర్ పదవి బీసీలకే ఇవ్వాలి
నల్గొండ మేయర్ పదవి బీసీలకు ఇవ్వాలని ఆవర్గం లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే తన ఎమ్మెల్యే సీటును బీసీ మహిళలకు ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ పేరు వినిపించింది, కానీ వెంకటరెడ్డి పోటీ చేయాలని పార్టీ కేడర్ పట్టుబట్టింది. ఇప్పుడు జనరల్ మహిళకు మేయర్ పదవి రిజర్వు అయ్యింది. ఈ పదవి కోసం బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మధ్యేమార్గంగా బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ, అబ్బగోని రమేష్గౌడ్ భార్య కవిత పేర్లు తెరపైకొచ్చాయి. 2000 సంవత్సరంలో చైర్మన్ బీసీ జనరల్ రిజర్వుకాగా, 2005లో జనరల్కు రిజర్వు అయ్యింది. ఈ రెండు టర్మ్లు కూడా పుల్లెంల వెంకటనారాయాణ గౌడ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో జనరల్ మహిళకు రిజర్వు కాగా, మోహన్ రెడ్డి భార్య సుజాత ఓడిపోవడంతో మధ్యేమార్గంగా బొడ్డుపల్లి లక్ష్మీ చైర్మన్ అయ్యారు. 2020 ఎన్నికల్లో చైర్మన్ జనరల్ కాగా, అభ్యర్థిగా శ్రీనివాస్రెడ్డిని ప్రకటించినప్పటికీ మెజార్టీ స్థానాలు గెలవలేదు. దీంతో బీఆర్ఎస్ మందడి సైది రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇదిలావుండగా.. ఇటీవల నల్లగొండ లో జరుగుతున్న పరిణామాలను బీసీ సంఘాలు నిశితంగా గమనిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను నల్లగొండకు రానివ్వకుండా బీసీ వ్యతిరేకి అనే అపవాదును మంత్రి మూటగట్టుకున్నారని…ఈ మచ్చ తొలిగిపోవాలంటే మేయర్ పదవి బీసీలకు ఇవ్వాలని ఆ సంఘం లీడర్లు కోరుతున్నారు.

కోదాడలో మంత్రి ఉత్తమ్ చూపు బీసీల వైపే..?
హుజూర్నగర్ మున్సిపాలిటీ బీసీ రిజర్వు కావడంతో అక్కడ ఎలాంటి సమస్య లేదు. కాకపోతే బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీసీ లీడర్లు చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. ఇక కోదాడ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వు కాగా, ఇక్కడ మున్నూరు కాపు, రెడ్డి, కమ్మ వర్గాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ్, భార్య పద్మావతి ఇద్దరు ఒకే వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కోదాడ కూడా బీసీలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన చైర్మన్ అభ్యర్థి పార సీతయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనరల్ నుంచి ఎర్నేని వెంకటరత్న బాబు పేరు వినిపిస్తుండగా, సీనియర్ నేత లక్ష్మీనారాయణ రెడ్డి తన సమీప బందువును పోటీలో దింపాలని చూస్తున్నారు.
చౌటుప్పల్, భువనగిరి బీసీలకే ఛాన్స్
చౌటుప్పల్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, కాంగ్రెస్ నుంచి బీసీ లీడర్లే పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, బత్తుల విప్లవ్గౌడ్, ఎమ్మెల్యే రాజోగోపాల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు మొగుదుల రమేష్గౌడ్ మధ్య పోటీ నెలకొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి తన వెన్నంటే నడిచే నాయకులకే సర్పంచ్లుగా అవకాశం ఇచ్చారు. విప్లవ్గౌడ్ను ఎంపీ ఎన్నికలకు ముందు సీపీఎం నుంచి కాంగ్రెస్లోకి తెచ్చారు. చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రెడ్డి వర్గానికి చెందిన చింతల దామోదర్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తమ భార్యలను చైర్మన్ అభ్యర్థులుగా నిలబెట్టాలని భావిస్తున్నారు. జనరల్ మహిళకు రిజర్వు అయిన భువనగిరిలో కూడా బీసీలకే ఛాన్స్ ఇస్తారని చెపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థులను కనఫర్మ్ చేస్తారని చెపుతున్నారు.
మిర్యాలగూడలో బీఆర్ఎస్ బీసీ…సూర్యాపేటలో ఓసీ
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వుకాగా కాంగ్రెస్ నుంచి రెడ్డి వర్గానికే దాదాపు ఖరారు కానుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కోడలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన రాణి (సిద్ధార్ధ భార్య) పోటీలో దింపనున్నారు. సూర్యాపేట జనరల్కు రిజర్వుకాగా, దివంగత మాజీ మంత్రి దామోదరెడ్డి సన్నిహితుడు కొప్పుల వేణారెడ్డి ని చైర్మన్గా ప్రకటించుకున్నారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి బీసీ నేత డాక్టర్ రామ్మూర్తి యాదవ్ను పోటీలో దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి గుర్రం సత్యనారాయణ రెడ్డి, గండు ప్రకాష్, అంగిరేకుల నాగార్జున పట్టుబడుతున్నారు. గతంలో జనరల్ మహిళకు రిజర్వు కాగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎస్సీని చైర్మన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఈసారి ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు.
బీసీల నుంచి జనరల్కు మారిపోయిన చైర్మన్ రిజర్వేషన్లు
| ప్రాంతం | ప్రస్తుత రిజర్వేషన్ | 2020 రిజర్వేషన్ |
| చండూరు | జనరల్ | బీసీ (మహిళ) |
| నకిరేకల్ | జనరల్ | బీసీ |
| యాదగిరిగుట్ట | జనరల్ (మహిళ) | బీసీ (మహిళ) |
| భువనగిరి | జనరల్ (మహిళ) | బీసీ |
| చౌటుప్పల్ | జనరల్ (మహిళ) | బీసీ |
| భూదాన్ పోచంపల్లి | జనరల్ | బీసీ (మహిళ) |
ఈసారి మూడు మున్సిపాలిటీల్లోనే బీసీ చైర్మన్లు
| ప్రాంతం | ప్రస్తుత రిజర్వేషన్ | 2020 రిజర్వేషన్ |
| దేవరకొండ | బీసీ (మహిళ) | జనరల్ |
| హుజుర్నగర్ | బీసీ | జనరల్ (మహిళ) |
| ఆలేరు | బీసీ (మహిళ) | బీసీ |
జనరల్కు పెరిగిన చైర్మన్, కార్పోరేషన్ స్థానాలు
| ప్రాంతం | ప్రస్తుత రిజర్వేషన్ |
| చండూరు | జనరల్ |
| నకిరేకల్ | జనరల్ |
| హాలియా | జనరల్ |
| పోచంపల్లి | జనరల్ |
| నేరేడుచర్ల | జనరల్ |
| తిరుమలగిరి | జనరల్ |
| సూర్యాపేట | జనరల్ |
| మిర్యాలగూడ | జనరల్ మహిళ |
| చిట్యాల | జనరల్ మహిళ |
| చౌటుప్పుల్ | జనరల్ మహిళ |
| భువనగిరి | జనరల్ మహిళ |
| యాదగిరిగుట్ట | జనరల్ మహిళ |
| కోదాడ | జనరల్ మహిళ |
| నల్లగొండ | జనరల్ మహిళ (కార్పోరేషన్) |