Big News: నేటి నుంచే పురపోరు.. కాంగ్రెస్​, సీపీఐ దోస్తీ.. బీఆర్​ఎస్​, బీజేపీ, సీపీఎం సీట్ల సర్ధుబాటు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్:  ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్లో ఎన్నికల వేడి నేటి నుంచి మొదలుకానుంది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి పెట్టాయి. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు, ప్రైవేటు ఏజెన్సీల సర్వేల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నల్లగొండ కార్పోరేషన్లో నలుగైదురు అభ్యర్థులు మినహా, ఉమ్మడి జిల్లాలో మరెక్కడా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. మంగళవారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థులను ప్రకటిస్తారని ఆశించారు. కానీ పట్టణంలో కార్యక్రమాలు ముగించుకుని హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. టికెట్లు రానోళ్ల కు భవిష్యత్తులో న్యాయం చేస్తామని ఆశావహుల పైన నీళ్లు చల్లారు. సీపీఐ ప్రభావితం చేయనున్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్తో సీట్ల సర్ధుబాటు చేసుకోనున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ ఇన్చార్జిలు మున్సిపాలిటీల్లో మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఆలేరు, భువనగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలతో, సీనియర్లకు నెల కొన్న విభేదాల వల్ల అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది. మిగతా మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులు కోసం వెతుకులాడుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్లు కాంగ్రెస్లో చేరిపోవడంతో బీఆర్ఎస్లో బలమైన అభ్యర్థులు కరువయ్యారు. పోటీ చేయడానికి ముందుకు వస్తున్న ఆశావహుల్లో చాలా మంది ఆర్ధికంగా, సామాజిక ప్రభావితం చూపే శక్తి లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్లో ఓడిపోయిన అభ్యర్థులను బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. మిర్యాలగూడలో మాత్రమే కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులను సిద్ధం చేసింది. చిన్న మున్సిపాలిటీల్లో అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సంకోచిస్తున్నారు.

బీఆర్ఎస్తో దోస్తీ కట్టేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూపిస్తు న్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఎవరితో పొత్తులు పెట్టుకో వద్దని ఒంటరిగానే పోటీ చేయాలని స్పష్టం చేసింది. కానీ పట్టణాల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత బలంగా ఉందని, దాన్ని దెబ్బకొట్టాలంటే లోపాయికారిక పొత్తులు అనివార్యమని సీనియర్లు అభిప్రాయపడుతు న్నారు. ఈ మేరకు సీట్ల సర్ధుబాటు చేసుకుంటే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. ప్రధానంగా నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్ మున్సిపాలిటీల్లో బీజేపీ బలంగా ఉంది. అవసరమైతే సీపీఎంను కూడా కలుపుకుని పోవాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. దాంతోనే అభ్యర్థులను ఫైనల్ చేయకుండా పెండింగ్లో పెట్టారు. నల్లగొండ, సూర్యాపేటలో మినహా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. ప్రకటించిన చోట కూడా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చే అవకాశం కూడా ఉంది.

నామినేషన్లకు మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. 15 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రకియ ముగియనుంది. బుధ, గురు, శుక్ర వారాల్లో బుధవారం దశమి, గురువారం ఏకాదశి, శుక్రవారం ద్వాదశి ఉంది. నామినేషన్ వేయడానికి బుధ, గురు వారాల్లో మంచి రోజులని వేద పండితులు చెపుతున్నారు. కాబట్టి అభ్యర్థుల ప్రకటన మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రకటిస్తామని, వెంటనే బీఫాంలు కూడా ఇస్తామని కాంగ్రెస్ లీడర్లు చెపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్లో మొత్తం 427 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తారు.

నామినేషన్ల స్వీకరణ చివరి గడువు: ఈనెల 30 వరకు. 

సమయం: ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు.

నామినేషన్ల పరిశీలన: జనవరి 31

నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 3

పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 

సమయం: ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13న

సమయం: ఉదయం 8 గంటల నుంచి అదే రోజున ఫలితాల వెల్లడి.

Share
Share