Breaking News: శాలిగౌరారం ఎంపీడీఓ ‘వసూల్ రాణి’ అవతారం? ప్రతి పనికీ ఓ రేటు..

నకిరేకల్/శాలిగౌరారం, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) జ్యోతిలక్ష్మి ప్రతి చిన్న పనికీ ఒక ధర నిర్ణయించి, కింది స్థాయి సిబ్బందిని పీల్చి పిప్పి చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు మరియు ఎంపీఓ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంలో ఎంపీఓ (MPO) వెంకటేశ్వర్లు నేరుగా రంగంలోకి వచ్చి ఎంపీడీఓ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు.

లంచం డిమాండ్: “నా జీతం కట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఎంపీడీఓ డిమాండ్ చేశారు. తప్పని పరిస్థితుల్లో 2025 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు సుమారు రూ. 32 వేలు ఆమెకు సమర్పించుకున్నాను” అని ఆయన వాపోయారు.

వసూళ్ల మార్గం: నేరుగా కాకుండా జూనియర్ అసిస్టెంట్ అజయ్ ద్వారా ఈ వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు.

మానసిక వేదన: డబ్బులు తీసుకోవడమే కాకుండా, విధుల్లో తీవ్రంగా అవమానిస్తున్నారని, ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆస్పత్రి పాలయ్యానని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఎంపీఓ మాత్రమే కాకుండా, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు కూడా ఎంపీడీఓ తీరుపై తిరుగుబాటు చేశారు.

బెదిరింపులు: డబ్బులు ఇవ్వని పక్షంలో సస్పెండ్ చేస్తామని, మెమోలు జారీ చేస్తామని ఎంపీడీఓ బెదిరిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు.

బలవంతపు వసూళ్లు: గతంలో తన కార్యాలయానికి ఎయిర్ కూలర్ కూడా కార్యదర్శులతో బలవంతంగా కొనిపించారని వారు ఆరోపించారు.

గంటల తరబడి వేచి చూడటం: పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్తే గంటల తరబడి బయటే నిలబెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆధారాలతో సహా ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మండల కార్యాలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రజా సేవ చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, తోటి ఉద్యోగులనే లంచం అడగడం పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఒక ఉన్నతాధికారిపై కింది స్థాయి సిబ్బంది సామూహికంగా ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

Share
Share