- ప్రజల ఆరోగ్యం కోసం ఎంపీ నిధులను వెచ్చిస్తా
- హెల్త్ క్యాంపులు అన్ని గ్రామాలకు విస్తరించాలి
మాడ్గులపల్లి, ఏపీబీ న్యూస్: గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని ధర్మాపురం గ్రామంలో కొండేటి ముత్తమ్మ జ్ఞాపకార్ధం మథర్ థెరిస్సా ఎడ్యుకేషన్ సొసైటీ, దీప్తి ఇనిస్ట్యూట్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు నిర్వహించడం హర్షనీయమన్నారు.
వివిధ రకాల జబ్బులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్ధిక ఇబ్బందులతో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి హెల్త్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని, దాంతో మెరుగైన వైద్యం చేయించుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. ఇలాంటి క్యాంపులు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఎంపీ నిధుల నుంచి కూడా ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు.

ఎస్పీ మాట్లాడుతూ….ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ చూపాలని, అనారోగ్యం ఉన్నట్లు తెలిస్తే డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలే తప్పా నిర్లక్ష్యం చేయోద్దని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేర తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దశరథ, డాక్టర్లు కొండేటి సౌమ్య శ్రీ, డాక్టర్ ప్రమోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇమ్యూనియుల్, చింతరెడ్డి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.