- రెండేళ్లలో 127 రోజుల్లో 83 సమావేశాలకే హాజరు
- దక్షిణ భారతదేశంలోనే రికార్డు మెజార్టీ ఘనత
- పార్లమెంట్ డిబేట్స్లో మాత్రం ‘నో-రికార్డ్స్’
- 22 అంశాల పైన చర్చించిన భువనగిరి ఎంపీ కిరణ్
- రాష్ట్ర, జాతీయ సమస్యల పైన పార్లమెంట్లో నిలదీత
- రెండేళ్లలో 127 రోజుల్లో 112 సమావేశాలకు హాజరు
- నాడు పార్లమెంట్లో సత్తా చాటిన ఎంపీలు ఉత్తమ్, వెంకటరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: పార్లమెంట్ సమావేశాల్లో జరిగే అధికారిక చర్చల్లో నల్లగొండ గొంతు మూగబోయింది. దక్షిణ భారతదేశంలోనే రికార్డు మెజార్టీ సాధించిన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి పార్లమెంట్ డిబేట్స్లో పాలుపంచుకున్నట్టు ఎక్కడా ఆధారాలు లభ్యం కావట్లేదు. పక్కనే ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గత రెండేళ్లలో 22 సమస్యల పైన పార్లమెంట్లో గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పైన బడ్జెట్ సమావేశాల్లో, సాధారణ సమావేశాల్లో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో కడిగి పారేశారు. జిల్లా నుంచి తొలిసారి గెలిచి, పార్లమెంట్లో అడుగుపెట్టిన యువ ఎంపీల్లో కిరణ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుండగా, రఘవీర్ మాత్రం చడీచప్పుడు చేయకపోవడం గమనార్హం.
83 సమావేశాలకే రఘువీర్…
2024 జూన్లో మొదలైన మొదటి సెషన్ 18వ పార్లమెంట్ సమావేశాలు ఇప్పటి వరకు 7 సెషన్స్ జరిగాయి. వీటిల్లో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు కీలకం. కాగా, పార్లమెంట్ వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పైన జరిగే చర్చల్లో సభ్యులు ప్రశ్నలు లెవనెత్తుతారు. వీటిల్లో జాతీయ, రాష్ట్రీయ సమస్యలతో పాటు, జిల్లాలోని ప్రధానమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులు, రహాదారుల గురించి ప్రశ్నించి అవసరమైన మేరకు డిమాండ్లు సాధిస్తారు. 1 నుంచి 7 సెషన్స్ వరకు దాదాపు 127 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. 83 రోజుల పాటు సమావేశాలకు నల్లగొండ ఎంపీ హాజరయ్యారు. 52 రోజుల పాటు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం రెండు విడతల్లో 19 రోజుల పాటు సమావేశాలు జరిగితే 7 సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. 12 సమావేశాలకు డుమ్మా కొట్టారు. కీలకమైన డిబేట్స్లో ఎక్కడా పాలుపంచుకోలేదు. ఇండియా కూటమి తరపున పార్లమెంట్ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీతో పాటు, ఎంపీ కిరణ్ని సస్పెండ్ చేశారు. పార్లమెంట్ మెట్ల పైన రాహుల్తో కలిసి నిరసన తెలిపారు. ఇలా పార్లమెంట్లో జరిగే ప్రతి ఇష్యూను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న కిరణ్, అంతే స్పీడ్తో సోషల్ మీడియాలో ఢిల్లీ కేంద్రంగా జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు పోస్టు చేసి, రాహుల్ గాంధీ వద్ద క్రెడిట్ కొట్టేస్తున్నారు.
రాష్ట్ర, జాతీయ సమస్యల పైన కిరణ్…
పార్లమెంట్ సమావేశాలు జరిగిన 127 రోజుల్లో 112 రోజుల పాటు హాజరుకాగా, 15 రోజుల పాటు గైర్హాజరయ్యారు. అది కూడా ఇటీవల రాహుల్ గాంధీతో పాటు, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు, శీతాకాల, వర్షాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. 22 అంశాల పైన పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రీజీనల్ రింగ్ రైల్వేలైన్ ప్రాజెక్టు, 42 శాతం బీసీ బిల్లును ఆమోదించాలని, మూసీ పునర్జీవన ప్రాజెక్టు అంశం, మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ పైన పార్లమెంట్లో ప్రశ్నించారు. జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్లోని మల్టి మోడల్ ట్రాన్స్పోర్ట్ గురించి, జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి నిధులు, వ్యసాయరంగానికి నిధుల కేటాయింపు, రైతుల సంక్షేమం, జలశక్తి నిధులు, లైఫ్ హెల్త్ ఇన్సురెన్స్ ఇలా 22 అంశాల గురించి పార్లమెంట్లో ప్రశ్నించి, భువనగిరి పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాతో ముడిపడి ఉండటం, నదీ ప్రవాహాం భువనగిరి జిల్లాలోనే ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టుకు నిధులతోపాటు, హోదా కల్పించాలని కిరణ్ డిమాండ్ చేశారు.
నాడు ఉత్తమ్, వెంకటరెడ్డిలు కొత్త ఎంపీలే…
గతంలో ఇదే స్థానాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా తొలిసారిగా ఎన్నికైన మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి కేంద్రంలో తమ సత్తా చాటారు. జాతీయ, రాష్ట్ర సమస్యలతో పాటు, జిల్లాలోని జాతీయ రహాదారుల గురించి పార్లమెంట్లో లేవనెత్తారు. దాంతోనే ప్రస్తుతం జిల్లాలో పెద్దపెద్ద రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీతో పాటు, పలు కీలక కమిటీలకు సభ్యుడిగా తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భారతదేశ భద్రత విషయంలో కీలక చర్చల్లో పాలుపంచుకోవడమేగాక, ఆయన సలహాలు, సూచనలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. జిల్లాకు సంబంధించి విజయవాడ – హైదరాబాద్ ప్రధాన జాతీయ రహాదారి వెంట బుల్లెట్ ట్రైన్ నడిపించాలని, రైల్వే మార్గాలను విస్తరించాలని, కొత్తగా జాతీయ రహాదారులు మంజూరు విషయంలో ఉత్తమ్ ప్రత్యేక చొరవ చూపించారు. అదేవిధంగా అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మోడీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారు. నితిన్ గడ్కరీతో స్నేహ సంబంధాలను మెరుగుపర్చుకున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహంతోనే నల్లగొండకు రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, విజయవాడ – హైదరాబాద్ రహాదారి వెడల్పు, జాతీయ రహాదారుల పైన ఫ్లైఓవర్లు నిర్మాణం జరుగుతోంది.