హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నేను గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, నా రాజీనామాను గత 4 నెలలుగా ఆమోదించలేదు. అందుకే నేను ప్రత్యేక సమయం తీసుకుని కౌన్సిల్ లో మాట్లాడుతున్నా, 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 40 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుంది. నన్ను ఎమ్మెల్సీ ని చేసిన బీఆర్ఎస్ పార్టీకి, నిజామాబాద్ జిల్లా ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కట్టుబాట్లు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం నైతికత కాదని రాజీనామా చేయదలుచుకున్నా, నా రాజీనామాను అంగీకరించాలి.
కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను..
నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా, కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2006లో నేను ఉద్యమంలోకి వచ్చినప్పుడే బీఆర్ఎస్ రాజకీయ శక్తిగా ఎదిగింది. 2006లో జాగృతిని స్థాపించి అనేక మంది యువకులను, మహిళలను ఉద్యమంలో గ్యాప్ ను పూర్తి చేశాము. జాగృతి తరపున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేశాను. తెలంగాణ చరిత్ర, బతుకమ్మ పండుగను ఊరూరా తీసుకు వెళ్ళాను. తెలంగాణ జాగృతి తరపున శ్రీ కృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చాము. ఇండిపెండెంట్ సంస్థగా మేము జాగృతిని నడిపాను.
2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి కేసీఆర్ వచ్చారు. అదే స్ఫూర్తితో నేను ఉద్యమంలోకి వచ్చాను. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఢిల్లీకి రమ్మని పిలిస్తే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు, కానీ రెండు నెలలు కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు లేని వాళ్లు నీ పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. గల్లీలో కొట్లాడటమే కాదు ఢిల్లీ లాబీల్లో నా పాత్ర ఉంది అని నేను చెపుతున్నా, ఆనాడు సోనియాగాంధీ సన్నిహితులు ఆస్కార్ ఫెర్నాండెజ్ తో 2013 లో కేసీఆర్ ను కలిపి సమావేశం ఏర్పాటు చేశాను. ఆ తర్వాత సోనియాగాంధీ జోక్యం చేసుకున్నారు. తెలంగాణ సాధన అంశం స్పీడ్ పెరిగింది.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు ఆగుతుందో అని భయంగా ఉండేది..
బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయాలనే వాదన వచ్చింది. కానీ 2014లో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదు. ఉద్యమంలోకి వచ్చేముందు ఆలోచించుకుని నా భర్తతో చర్చించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన, ఒక అంతర్జాతీయ ఎన్జీవో నడపాలని అనుకున్నా, 2014లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది, నాడు పార్టీ ఆహ్వానం మేరకు నేను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశాను.
ఎప్పుడూ నేను అడుక్కొని టిక్కెట్ తీసుకోలేదు..
ప్రజలు గౌరవించి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది, నేను ఎంపీ అయ్యాను. రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం నేను ఎంపీగా నా వంతు ప్రయత్నం చేశాను, నేను ఎక్కడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను వదలలేదు. నా దగ్గరకు ఎప్పుడూ పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లు రాలేదు, కార్మికులు, చిన్న, చిన్న ఉద్యోగులు మాత్రమే వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పేపర్లు, మౌత్ పీసులు నాకు ఎప్పుడూ అండగా నిలవలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసుకోలేదు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థను మరింత పెంచాము. బీఆర్ఎస్ అంతర్గత వేదికల్లో నేను ప్రశ్నిస్తే నాపై కక్ష గట్టారు.
నన్ను కక్షగట్టి పార్టీ నుంచి బయటకు పంపారు..
పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో నా పాత్ర లేకుండా చేశారు. నాడు భాదపడ్డా నేడు సంతోషపడుతున్నా, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే, పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చెప్పాను. అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సచివాలయం నుంచి కలెక్టరేట్ల వరకు తీరని అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన రెండు కలెక్టర్ కార్యాలయాలు వరద ముంపులో మునిగిపోయాయి. నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను దూరం పెట్టారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయినా ఉద్యమకారులకు 10 లక్షలు ఇద్దామని చెప్పిన, ఉద్యమకారులను గుర్తించలేక పోయారు. నీళ్లు, నిధులు, నియామకాలకు గండి కొట్టారు. కొంతమంది ప్రజాప్రతినిధుల దూరాగతలపై నేరుగా ఫిర్యాదు చేశాను. నేరేళ్ల ఇసుక దందా లాంటి దురాగతాలు జరిగాయి, నెరేళ్ళలో దళిత బిడ్డలు బలి అయ్యారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నిర్లక్ష్యం చేశారు.