గెలుపు గుర్రాలకే కౌన్సిలర్ టికెట్లు! సొంతంగా సర్వేలు చేయిస్తున్న ఎమ్మెల్యేలు

నల్గొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే నిలబెట్టేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు, పురపోరులో రిపీట్ కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. దీనిలో భాగంగా పలు చోట్ల ఎమ్మెల్యేలు సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు. మాజీ కౌన్సిలర్ల పట్ల ప్రజల అభిప్రాయం? కౌన్సిలర్గా ఎవరైతే బాగుంటరు? వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరణ ఏవిధంగా ఉంది? ప్రత్యర్ధి పార్టీల బలం, బలహీనతల గురించి లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మాజీ కౌన్సిలర్లు, ఆశావహులతో ఒకదఫా చర్చలు కూడా పూర్తి చేశారు. బీఆర్ఎస్ బలం ఉన్న మున్సిపాలిటీల్లో మాజీ ఎమ్మెల్యేలు సైతం అంతర్గత మీటింగ్లు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే నాటికి అభ్యర్థుల ఎంపికలో ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్, కోదాడ, హాలియా, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్, చౌటుప్పుల్, నేరేడుచర్ల, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, చిట్యాల, హాలియా, చండూరు, నందికొండ, కోదాడ, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మెజార్టీ సభ్యుల బలం లేకపోవడంతో పలు చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓటుతో పాలక వర్గాలు చేజిక్కించుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో తేవడంతో బీఆర్ఎస్ చైర్మన్ల పైన అవిశ్వాసం తీర్మానం పెట్టి గద్దెదింపారు. దాంతో అప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్న కౌన్సిలర్లు మూకుమ్మడి గా కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో 1 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలం పెరిగింది. నాలుగేళ్లు బీఆర్ఎస్, ఒక ఏడాది కాంగ్రెస్ పాలన సాగింది.

పంచాయతీ ఎన్నికల తరహాలోనే రొటేషన్ సిస్టమ్లో మున్సిపాలిటీ లో వార్డులు, చైర్మన్ రిజర్వేషన్లు మారనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వేషన్లు మారితే కొత్త అభ్యర్థులను బరిలో దింపాల్సిన పరిస్థితి వస్తది. పైగా ఇప్పటికే రెండు, మూడు సార్లు వరుసగా గెలిచిన కౌన్సిలర్ల పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గతంలో అనేక సార్లు ఓటమిపాలైన అభ్యర్థుల పట్ల సహజంగానే సానుభూతి వ్యక్తమవుతోంది. అదీగాక కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కౌన్సిలర్లు వ్యవహారించిన తీరు పలుచోట్ల ఎమ్మెల్యేలను, చైర్మన్లను ఇరకాటంలో పడేసింది. దాంతో మేజర్ మున్సిపాలిటీలు, పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించే  మున్సిపాలిటీల్లో కచ్చితంగా అభ్యర్థుల మార్పు ఉంటుందనే సంకేతాలు ఇప్ప టికే ఇచ్చారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చిన కౌన్సిలర్లకు అవకాశం ఇచ్చేది లేదని తేల్చిచెప్తున్నారు. గ్రూపు పంచాయితీలు బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో సొంత పార్టీ అభ్యర్థులకే ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వనున్నారు. వలస లీడర్లకు చెక్ పెట్టేందుకు వాళ్ల స్థానంలో కొత్త అభ్యర్థులను తెరవెనక ప్రోత్సహిస్తున్నారు. దాదాపు అన్ని మున్సిపాలిటీ ల్లో వలసొచ్చిన కౌన్సిలర్లు సగానికి పైగా ఉన్నారు. వీళ్లలో సీనియర్ కౌన్సిలర్ల విషయంలో కాస్తంతా ముందు వెనకా ఆలోచిస్తున్నా..ఈ రెండేళ్లలో తమతో విభేదించి సొంత పార్టీలోనే వేరే లీడర్లతో అంట కాగుతున్న కౌన్సిలర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వమని చెప్పేస్తున్నారు. దాంతో వారంతా తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్లేందుకు తెరవెనక చర్చలు జరుపుతున్నారు.

Share
Share