- వైస్ చైర్మన్ పదవులకే పరిమితం
- అవిశ్వాసంతో చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి
- బీసీ రిజర్వు కాకపోవడంతో నిరాశచెందిన అబ్బగోని
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాజకీయాల్లో అదృష్టం కొందరికి అనుకోకుండా కలిసొస్తే…మరికొందరికి వచ్చినట్టే వచ్చి చేజారుతుంది. ఒకేపార్టీలో ప్రాణస్నేహితులుగా మెలిగిన బుర్రిశ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్లు మేయర్ పదవి ఆశించారు. కానీ రిజర్వేషన్లు తారుమారవడంతో వీళ్ల స్థానం లో భార్యలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. గతంలో కూడా వీళ్లిద్దరికీ ఛాన్స్ వచ్చేనట్టే వచ్చి చేజారిపోయింది. గత రెండు టర్మ్ల నుంచి చైర్మన్ పీఠం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఈ ఇద్దరు లీడర్లకు వైస్ చైర్మన్ పదవులకు పరిమితమయ్యారు.
కాంగ్రెస్ అధికారంలో కి వచ్చాక బీఆర్ఎస్ చైర్మన్ సైదిరెడ్డి పైన అవిశ్వాస తీర్మానం పెట్టించి చివరి ఏడాదిన్నర పాటు శ్రీనివాస్ రెడ్డి చైర్మన్గా పని చేశారు. ఈసారి మేయర్ స్థానం జనరల్ అయితే శ్రీనివాస్ రెడ్డి, బీసీ అయితే రమేష్ గౌడ్కు వస్తదని భావించారు. కానీ ఇద్దరికి అవకాశం మిస్సైంది. శ్రీనివాస్ రెడ్డి వేరొక వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ రమేష్గౌడ్ కు మాత్రం అలాంటి అవకాశం లేదనే చెప్పాలి. సిట్టింగ్ వార్డు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆయన భార్య కవిత కౌన్సిలర్గా పోటీ చేయనున్నారు.
2014లో చేజారిన ఛాన్స్
2014లో నల్గొండ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు కాగా, ఓసీ లకు కేటాయించారు. దీంతో మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ స్థానం కోసం పోటీపడ్డారు, కానీ మంత్రి కోమటిరెడ్డి మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మోహన్ రెడ్డి భార్య ఓడిపోయింది. దీంతో చైర్మన్ అయ్యే అవకాశం బీసీలకు దక్కింది. అప్పుడు అనూహ్యంగా రమేష్గౌడ్ తెరపైకి వచ్చారు. అయితే అప్పటికే రెండు పర్యాయాలు ‘గౌడ’సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడంతో రమేష్కు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మీని చైర్మన్ చేశారు.
2020లో బుర్రికి మిస్సైన ఛాన్స్
2020 ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగారు. అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. దీంతో 48 వార్డులకు 20 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి మద్ధతుతో చైర్మన్ అయ్యే అవకాశం లభించింది. కానీ చివరకు బీజేపీ హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంతో శ్రీనివాస్ రెడ్డికి అవకాశం చేజారిపోయింది.