- ఎంపీ రఘువీర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో విభేదాల?
- పార్టీ నేతల మధ్య లోపించిన సమన్వయం
- పంచాయతీ ఎన్నికల్లో రాజుకున్న బీఆర్ఎస్ పాలిటిక్స్
- మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకే బెదిరింపులు
- సీఎం రేవంత్ సమక్షంలోనే ఆవేధన వెళ్లగక్కిన ఎమ్మెల్యే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని ఏకాకిని చేసి రాజకీయంగా బద్నాం చేస్తున్నది నిజంగా మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావేనా? సీఎం రేవంత్ నిన్న జరిగిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే పైన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మారెడ్డి ఒంటెద్దు పోకడలతోనే పార్టీ కేడర్లో గందరగోళం నెలకొందనే టాక్ వినిపిస్తోంది. సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో లేనంతగా మిర్యాలగూడలో బలమైన నాయకత్వం పనిచేస్తోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రఘువీర్, శంకర్ నాయక్లకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు వరించాయి. ఉమ్మడి జిల్లాలో మూడు కీలకమైన పదవులు ఉన్న ఏకైక నియోజకవర్గం మిర్యాలగూడ, దీనికి అధనంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ సిఫార్సు మేరకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న లక్ష్మారెడ్డిని రెండేళ్లకే ఏకాకిని చేసి మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు బెదిరింపులకు పాల్పడుతుంటే బలమైన నాయకత్వం ఎందుకు జోక్యం చేసుకోలేకపోయింది? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

పార్టీలో ముదిరిన విభేదాలు
కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికైన నియోజకవర్గాల్లో వాళ్ల వైఖరి పట్ల పార్టీ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు, ఎమ్మెల్యేల అనుచరులకు మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వీటిని సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు. దీంతో మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జానారెడ్డి ప్రధాన అనుచరుడైన మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ చేరికను ఎమ్మెల్యే మొదటి నుంచి వ్యతిరేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎంపీ వర్గీయులకు సరియైన ప్రయార్టీ లభించకపోవడంతో పార్టీ కేడర్లో చీలిక వచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. దీన్నే అదునుగా భావించిన బీఆర్ఎస్ గ్రామాల్లో స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ పోటీ చేశారు. దాదాపు వందకు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ తీవ్ర ప్రభావం చూపింది. 36 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మున్సిపాల్టీ పైన కన్నేసింది.
అక్రమ కేసులు ఎదుర్కొన్న కాంగ్రెస్
ఇన్నాళ్లు తన పైన వస్తున్న విమర్శలను ఏనాడు తిప్పికొట్టని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏకంగా సీఎం బహిరంగ సభలో తన భావోద్వేగాన్ని వెళ్లగక్కడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఉత్తమ్ ఎంపీగా ఉన్నప్పుడు మిర్యాలగూడెంలో ఇదే ఎమ్మెల్యే భాస్కర్రావు కాంగ్రెస్ నాయకుల పైన అక్రమ కేసులు పెడితే పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే బెదిరించడం ఆషామాషీ కాదని, అదే నిజమైతే చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉందనే విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే బత్తుల దిగిచ్చొనట్టేనా…?
మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు తన కుటుంబాన్ని రోడ్డుకు లాగిండని ఆరోపించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిన్నటి సభలో ఇక నుంచి రఘువీర్, శంకర్ నాయక్తో కలిసి పనిచేస్తానని, జానారెడ్డి అడుగుజాడల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఎమ్మెల్యే ఇప్పటికైనా దిగొస్తారా? అనేది వేచి చూడాల్సిందే. సీఎం రేవంత్ సైతం ఎమ్మెల్యే కు భరోసా ఇవ్వడం మరింత బలాన్ని పెంచింది. రేషన్ కార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమలగిరి సభలో ఎమ్మెల్యే మందుల సామేల్కు చురకలు అంటించిన సీఎం ఇక్కడ మాత్రం లక్ష్మారెడ్డికి భరోసా ఇవ్వడం కొసమెరపు. ఎమ్మెల్సీ, ఎంపీ, ఇద్దరు మంత్రులు మిర్యాలగూడెంకు అండగా ఉన్నారని, కేడర్ భయపడొద్దని సీఎం ధైర్యాన్ని నింపడంతో పార్టీలో జోష్ పెరిగింది.