మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై బీఆర్ఎస్ ఏజెంట్ల పైన, మాజీ ఎమ్మెల్యే కొడుకు సిద్దార్ధ పైన దాడి చేశారు. పలు వార్డుల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలతో బుధవారం మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఓటర్లు ఆందోళన చెందారు. పోలీసు బలగాలు మోహరించినప్పటికీ రూలింగ్ పార్టీ నేతల ఆగడాలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న ఎమ్మెల్యే ఏదోరకంగా గొడవలు సృష్టించి బీఆర్ఎస్ను ఓడించేందుకు దాడులకు ఉసిగొల్పారు.
భాస్కర్ రావు కొడుకు సిద్ధార్ధ టార్గెట్
మిర్యాలగూడెం ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మరో పల్నాడుగా మారడం ఖాయమని సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఎమ్మెల్యే ఆగడాల పైన బీఆర్ఎస్ కేడర్ ముందు నుంచి ఆందోళన చెందుతోంది. స్థానిక పోలీసులు సైతం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న క్రమంలో ఏకంగా రౌడీ షీటర్లు ఎంట్రీ ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కొడుకు పైన దాడికి దిగడంతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురియ్యారు. 29వార్డులో పోలింగ్ ముగిశాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాత రౌడీషీటర్ ఒకరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని బీఆర్ఎస్ ఏజెంట్ల పైన దాడి చేశారు. దాడి చేయాలనే ఉద్దేశంతోనే పక్కా పథకం ప్రకారం పోలింగ్ కేంద్రం వద్ద ఓ రహస్య ప్రదేశంలోనే మారణాయుదాలు దాచిపెట్టినట్టు తెలిసింది.
మిర్యాలగూడెంలో పేరు మోసిన రౌడీషీటర్ తన ప్రవర్తన మార్చుకోవడంతో అప్పటి ఎమ్మెల్యే భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిండు, కానీ బీఆర్ఎస్ లో అతని ఆగడాలు భరించలేక ఏదోరకంగా వదలించుకున్నారు. తీరా మున్సిపల్ ఎన్నికలు రావడంతో దీన్నేఅదునుగా భావించిన అతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి కౌన్సిలర్గా పోటీ చేసిండు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమని మొదటి నుంచి ఇంటిలిజెన్స్ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో రౌడీషీటర్లను అడ్డంపెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహాంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెరవెనక నుంచి దాడికి ఉసిగొల్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పోలింగ్ కేంద్రం వద్ద దాడిలో గాయపడ్డ ఏజెంట్లను పరామర్శించేందుకు వెళ్లిన సిద్ధార్థ పైన దాడి చేశారు. గాయపడ్డ ఏజెంట్లను స్థానిక ప్రభుత్వా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ సంఘటనతో మిర్యాలగూడెం పట్టణ ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇదిలావుండగానే 32వ వార్డులో టిఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ బూతుల వద్ద దౌర్జన్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ దాడికి దిగడంతో పోలీసులు ఆందోళనకారుల పైన లాఠీచార్జీ చేశారు. ఎనిమిదో వార్డులో సైతం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.
కాంగ్రెస్ కార్యకర్తల దాడులు
ఆరో వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఆంధ్ర ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారు. 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందినోళ్లు దొంగ ఓటు వేయిస్తుండగా టిఆర్ఎస్ కార్యకర్త అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లమోతు సిద్ధార్థలు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసుల పట్ల ఎన్నికల అధికారుల తీరుపైన మండిపడ్డారు.