- సీఎం రేవంత్ సభ తర్వాత ఎమ్మెల్యే కు పెరిగిన బలం
- ఇంటిలిజెన్స్ సర్వే రిపోర్ట్ లు పటా పంచలు
- జిల్లాలో 31 వార్డుల గెలుపుతో అగ్రస్థానం
- క్యాంపు రాజకీయాలకు సైతం దూరం
- బీఆర్ఎస్కు చమటలు పట్టించిన పార్టీ కేడర్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పంతం నెగ్గారు. నల్లగొండ జిల్లాలో అత్యధిక వార్డులు కైవసం చేసుకున్న మున్సిపాలిటీగా మిర్యాలగూడ రికార్డుకెక్కింది. నల్లగొండ కార్పోరేషన్లో 48 వార్డుల్లో 27 కాంగ్రెస్ గెలిస్తే, పక్కనే ఉన్న మిర్యాలగూడలో 31 వార్డులు సొంతం చేసుకుంది. గత రెండేళ్ల లో మిర్యాలగూడలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కేవలం రూ.295 కోట్లు మాత్రమే, అదే నల్లగొండ కార్పోరేషన్లో రెండు వేల(2000) కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు, పైగా నల్గొండతో పోలిస్తే మిర్యాలగూడెం ఎమ్మెల్యే వైఖరి పైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు సైతం బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తోందని, మాజీ చైర్మన్ భార్గవ్, ఎంపీ రఘువీర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలకు మధ్య విభేదాలు ఈ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పార్టీ హైకమాండ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
సీఎం సభతో మారిన సీన్
సీఎం రేవంత్ మొదటి మున్సిపల్ ఎన్నికల సభ మిర్యాలగూడలో నిర్వహించి అందరి అంచనాలు పటాపంచలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు పైన నిప్పులు చెరిగిన సీఎం, అదే వేధిక పైన ఎమ్మెల్యేకు కొండంత అండగా నిలబడ్డారు. అప్పటి వరకు తనపైన వచ్చిన ఆరోపణలన్నీ సీఎం వేధిక పైన ఎమ్మెల్యే గట్టి కౌంటర్ ఇవ్వడంతో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. గూడెంలో పార్టీని ఆగం చేసేందుకే మాజీ ఎమ్మెల్యే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగిండని, పార్టీని కాపాడుకునేందుకే తన కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయించాల్సి వచ్చిందని సీఎం సమక్షంలోనే రగల్చిన సెంటిమెంట్ ఎన్నికల్లో బాగా వర్కవుట్ అయ్యింది. సీఎం సభ తర్వాత మున్సిపాలిటీలో ప్రచారం హోరెత్తింది.
ప్రత్యర్థుల అంచనాలకు చిక్కకుండా
ప్రత్యర్థుల అంచనాలకు చిక్కకుండా ఎమ్మెల్యే వ్యవహారించిన తీరు ఎన్నికల ఫలితాల్లో అద్బుతమైన ఫలితాలు తెచ్చిపెట్టింది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తరలిస్తే బీఎల్ఆర్ మాత్రం క్యాంపు పాలిటి క్స్కు దూరంగా ఉన్నారు. అంతేగాక ఎక్స్ఆఫిషియో ఓటు సైతం మిర్యాలగూడెంలో నమోదు చేసుకున్నారు. మొదటి నుంచి ఎమ్మెల్యే వైఖరి పైన దుమ్మెత్తిపోసిన మాజీ ఎమ్మెల్యే అండ్ టీమ్ 20 వార్డులు కచ్చితంగా గెలుస్తామని భావించింది, భార్గవ్ను అడ్డంపెట్టుకుని మున్సిపాలిటీనీ దెబ్బకొట్టాలని ప్లాన్ చేసింది. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యే భార్గవ్కు ఇచ్చిన మూడు వార్డులు ఓడిపోతాయని పసిగట్టి బీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేశారు. బీఆర్ఎస్ గెలుస్తదని అంచనా వేసిన వార్డుల పైన ఎమ్మెల్యే గురిపెట్టారు, చివరకు మాజీ ఎమ్మెల్యే పీఏ రాంబాబు సైతం ఓడిపోయే రీతిలో చక్రం తిప్పారు. ఈ ఫలితాలతో మిర్యాలగూడలో బీఎల్ఆర్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు.