యాదాద్రి, ఏపీబీ న్యూస్: వెనుకబడిన ప్రాంతాల్లో యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో ఏటిసీ శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతంలో ఐటీఐ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ 3,622 కోట్ల రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని మంత్రి ప్రశంసించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వ్యవస్థను నాశనం చేసిందని, ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నామని, మంత్రి గా పేదలకు ఇళ్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం పరస్పరం కొట్లాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ ఇండియా స్కూల్స్ పేదలకు వరంగా మారాయని, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని యువతకు భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, శిక్షణతో పాటు ఉద్యోగ భర్తీ కూడా చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉద్యమకారుడైన ఎమ్మెల్యే మందుల సామేల్ కోసం తుంగతుర్తిలో అత్యుత్తమ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షయ్ యాదవ్, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, ఏఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.