ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం: మంత్రి కోమటి రెడ్డి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం అయన నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరిస్తామని, అందుకే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

విద్యాభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, తెలంగాణ మోడల్ స్కూల్ లను నిర్మిస్తున్నామని ఈ పాఠశాలలకు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని, నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు, నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నదని, రాష్ట్రంలోని మూడు కోట్ల 15 లక్షల మంది ప్రజలకు లాభం చేకూరేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ పథకం అమలు చేయనుందని, ప్రమాదంలో లేదా జబ్బులతో ఎవరైనా చనిపోతే ఇందిరమ్మ జీవిత బీమా అమలవుతుందని, ఏప్రిల్ ఒకటి నుండి ఈ పథకం ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. అలాగే ఎల్ కె జి(LKG) నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించే కొత్త పథకాన్ని కూడా అమలు చేయనున్నామని, దివ్యంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు అందిస్తున్నామని, రైతులు సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు.

తిప్పర్తి మండల కేంద్రంలో 60 లక్షలతో సిసి రోడ్లు నిర్మించడం జరిగిందని, మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తున్నామని, 6 కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల మంజూరు చేసామని, 26 కోట్ల రూపాయలతో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి జీవో త్వరలో రానుందని, 15 రోజుల్లో టెండర్లు పిలిచి అన్ని సేవలు అందించేలా పీహెచ్సీ ని తీర్చిదిద్దుతామని, అలాగే కనగల్ లో సైతం పిహెచ్ సి(PHC) ని మంజూరు చేసినట్లు చెప్పారు.  మండలంలో గతంలో 100 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, నిధులు లేనందున మధ్యలో నిర్మాణాలు ఆగిపోయాయని, వాటికి నిధులు మంజూరు చేయిస్తామని, నెల రోజుల్లో గృహప్రవేశాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశాల కోసం తన సొంతంగా ప్రతి ఇంటికి 20వేల రూపాయలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వీటితోపాటు, ఇదివరకే 130 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామన్నారు.

మండలంలో గ్రామ సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నామని, సిసి రోడ్లు, డ్రైనేజీలతో పాటు, సాగునీరు అందించే కాలువల మరమ్మతులకు మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి లైనింగ్ చేపట్టామని, మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం పాతబడిపోయినందున 70 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని చూడాల్సిందిగా ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తిప్పర్తి మండలానికి రెండు బస్సులు ఇచ్చేందుకు మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తామని, మహిళలకు ఇదివరకే వడ్డీ లేని రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలం సమాఖ్య ద్వారా మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మహిళా సంఘాలు ముందుకు రాగా, అందుకు వెంటనే మంత్రి స్పందిస్తూ మహిళా సంఘాల చేత మూడు దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఓ(DRDO) ను ఆదేశించారు. తిప్పర్తి మండల కేంద్రానికి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో 100 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు ఇవ్వగా గతంలో నిధుల చెల్లింపుతో ఆగిపోయాయని, మంత్రి ఆదేశంతో తక్కిన నిధులను వెచ్చించి త్వరగా నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవలే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 10 వేల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించారని, మండలంలో 352 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరా మహిళ శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, రైతులకు రైతు భరోసా నిధులను ఇటీవల ప్రభుత్వం అందించిందని, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అధికారుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, స్థానికంగా సర్పంచుల వ్యవస్థ చాలా ముఖ్యమని అన్నారు. పేద కుటుంబాలకు, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ లబ్ధి అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

Share
Share