- మీడియా సమావేశంలో జర్నలిస్టులకు క్లాస్పీకిన మంత్రి
- ఎప్పుడో స్థలం ఇచ్చిన కలెక్టర్ వద్దే ఫైల్
- మీరే వెంటబడి చేయించుకోవాలే.. నేను వెంటబడి పొడవ
- కలెక్టర్ ప్రాబ్లమ్ ఉందని చెబితే మళ్లీ కేబినెట్లో పెట్టిస్తా
- అనవసరంగా నోరు పారేసుకోవద్దని వార్నింగ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల ప్లాట్ల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధనంగా కొంత కఠువుగానే స్పందించారు. 2006లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జిల్లా కలెక్టరేట్ సమీపంలో 8 ఎకరాల స్థలం కేటాయించడ జరిగిందని, దానికి కేబినెట్ అప్రూవల్ కూడా చేశామని మంత్రి చెప్పారు. ఆ స్థలాన్ని లేవుట్ చేసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైనే ఉందని మీ పనికి కూడా నేను వెంటబడి పొడవాలంటే సాధ్యం కాదని చెప్పారు. 8 ఎకరాల స్థలాన్ని లేఅవుట్గా మారిస్తే తలా 100 గజాల జాగ వస్తదని, గజం 20, 30 వేలు ఉంటదని, అంటే 100 గజాలు 25 లక్షలు ఖరీదు చేస్తదని, ఇందిరమ్మ ఇళ్లు కింద మరో రూ.5లక్షలు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మీ ప్లాట్ల గురించి పాత కలెక్టర్కు ,ఇప్పుడున్న కలెక్టర్కు చెప్పడం జరిగిందని, దాన్ని పట్టించుకోకుండా నా వెంట తిరిగితే మీకేం వస్తదని మందలించారు. 8 ఎకరాల స్థలం వ్యవహారంలో కలెక్టర్ ఏదైన సమస్య ఉందని చెబితే అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మళ్లీ కేబినెట్లో పెట్టిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
గతంలోనే మీరంతా ప్లాట్లు తీసుకోవాల్సి ఉండేదని, కానీ మీలో కొందరు జర్నలిస్టులు పానగల్లు వద్ద జాగలు తీసుకున్నారని, వాళ్ల పైన మీరు గొడవలు చేశారని, అదంతా సోషల్మీడియాలో వైరల్ కావడం, చివరకు వాళ్లు తీసుకున్న ప్లాట్లు రద్ధు చేయించారని మంత్రి అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యల పైన మరో జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రి సీరియస్ అయ్యారు. అనవసరంగా నోరు పారేసుకోవద్దని, మీరన్న మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మరోసారి నా ముందు ఎవరిని దూషించొద్దని మంత్రి క్లాస్ పీకారు.
స్టాఫర్లు రాకుండా కెమెరామెన్లను పంపిస్తే ఎట్లా
రాష్ట్రంలో ఇప్పుడు కేబినెట్లో నేను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే సీనియర్ మంత్రులం, అలాంటిది నేను వచ్చినప్పుడు స్టాఫర్లు రాకుండా కెమెరామెన్లు, సోషల్ మీడియా వాళ్లు వస్తే నేనేం మాట్లాడాలి వాళ్లతో వాళ్లకు ఏం అడగాలో తెల్వదు నేను చెప్పేది వాళ్లకు అర్ధం కాదు. ఇక సోషల్మీడియా వాళ్లు ఇష్టం వచ్చినట్టు రాస్తరు. అసలు సోషల్మీడియా వాళ్లను నాదగ్గరికి రావొద్దనే చెప్పిన, అని మంత్రి సీరియస్ అయ్యారు. నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత రాజీపడే ప్రసక్తే లేదని, నాటీమ్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయని, మీరు ఇలాగే లేనిపోని వార్తలు ప్రసారం చేస్తే పనులు వదిలేసి పోతానని కాంట్రాక్టర్లు చెప్పారని మంత్రి అన్నారు.