APB News Exclusive: ‘ఉపాధి’నిధుల కోసం.. పట్టుబిగిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లాకు మంజూరైన నిధుల్లో వాటా కావాలని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. గత రెండేళ్ల నుంచి ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్ రావడం లేదు. పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5కోట్ల గ్రాంట్ ఏమూలకు చాలడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం నిధుల్లో వాటా కోసం పట్టుబిగిస్తున్నారు. గతంలో ఈ నిధుల కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య వార్ నడిచింది. మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సిఫార్సు మేరకు ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులు కేటాయించడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఇప్పుడు మళ్లీ అవే నిధుల కోసం ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒత్తిడి చేస్తున్నారు.

2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఉమ్మడి జిల్లాకు రూ.211.36 కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి రూ.3కోట్ల చొప్పున ఎమ్మెల్యేలకు కేటాయించారు. ఈ నిధుల్లో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్కు వాటా దక్కలేదు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన గ్రాంట్స్లో ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సులు పనిచేయడం లేదు. పలువురు ఎమ్మెల్యేలు పర్సంటేజీలకు వర్క్స్లు అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఎంపీలు, ఎమ్మెల్సీల అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి నిధుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాటా ఇవ్వాల్సిందేనని ఎంపీ కిరణ్ డిమాండ్ చేయడంతో చివరకు రూ.50 లక్షలు దక్కించుకున్నారు. తన సొంత మండలం శాలిగౌరారంలో సీసీ రోడ్లకు ఈ నిధులు కేటాయించారు.

ఎంపీ కిరణ్ సెగ్మెంట్ ఐదు జిల్లాలకు విస్తరించి ఉన్నందున కేంద్రం ఇచ్చే రూ.5 కోట్ల గ్రాంట్స్ చాలడం లేదు. జనగామలో పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ కూడా నిధులు పెట్టాల్సి వస్తోంది. తన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేలు వైఖరి పైన పార్టీలో గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ సొంత మండలం శాలిగౌరారంలో ఎమ్మెల్యే తన అనుచరులకు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. దీంతో ఎంపీ వర్గీయులు తీవ్ర అసంతృప్తివ్యక్తం చేయడంతో ఎంపీ కిరణ్ నిధుల కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు నల్లగొండ జిల్లా నుంచి శాలిగౌరారం మండలానికి మరో 50 లక్షలు ఇచ్చారు. ఇలా ఒకే మండలానికి కోటి రూపాయాలు ఇస్తే మిగితా మండలాల పరిస్థితి ఏంటని ఇంకోవైపు లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నిధులను పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా పర్సంటేజీలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని పార్టీ కేడర్ ఆరోపిస్తోంది. కొన్నిచోట్ల ప్రైవేటు ఏజెన్సీలకు పనులు కట్టబెట్టి సర్పంచ్లకు, పార్టీ నాయకులకు హ్యాండిచ్చారు.

నియోజకవర్గానికి రూ.3కోట్లు చాలవని, అధనంగా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు తండ్లాడుతున్నారు. జిల్లా మంత్రి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రూ.4 కోట్లు శాంక్షన్ చేశారు. అదే పద్ధతిలో తమకు కూడా అధనంగా నిధులు పెంచాలని దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ రూల్స్ ప్రకారం ఈ దఫా మహిళా సంఘాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టొదని, మొత్తం నిధుల్లో సీసీ రోడ్లు 20 శాతానికి మించొద్దని నిబంధనలు చెపుతున్నాయి. ఈ మేరకు మహిళా స్వయం సహాయ సంఘాల భవనాలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, గ్రామ పంచాయతీ భవనాలకు మెజార్టీ నిధులు కేటాయించారు. గతేడాది జూన్లో ఈ పనులన్నీ శాంక్షన్స్ చేశారు. కానీ అప్పుడు సర్పంచ్లు లేకపోవడంతో పనులు పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో అదనపు నిధులు ఎక్కడి నుంచి తేవాలో అర్ధంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

నల్లగొండ జిల్లాకు కేటాయించిన రూ.110 కోట్లలో రూ.12 కోట్లు మహిళా సంఘాల భవనాలకు, రూ.9కోట్లు 96 అంగన్ వాడీ కేంద్రాలకు కేటాయించారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు మూడు కోట్ల చొప్పున రూ.18 కోట్లు, మంత్రి కోమటిరెడ్డికి అధనంగా మరొక కోటి కేటాయించారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్లు పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. వీవో బిల్డింగ్స్ను ప్రైవేటు కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. మార్చి 31 నాటికి ఈ మొత్తం పనులు పూర్తి చేయాలి, కానీ సర్పంచ్లు లేకపోవడంతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనే పూర్తివుతాయని అధికారులు చెపుతున్నారు.

Share
Share