Breaking News: పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని పెళ్లాడిన ఉపాధ్యాయుడు.. పోక్సో కేసు నమోదు

మేడ్చల్, ఏపీబీ న్యూస్: గురువుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక వ్యక్తి, మైనర్ విద్యార్థినిపై కన్నేసి, ప్రేమ పేరుతో వంచించిన ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో లోబర్చుకుని, రహస్యంగా వివాహం చేసుకున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోచారం డివిజన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైటీన్ (27) భౌతికశాస్త్ర (Physics) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై అతడు దృష్టి సారించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో వంచించి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నాడు.

గత 20 రోజుల క్రితం సదరు విద్యార్థిని మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించారు. అనుమానంతో గట్టిగా నిలదీయగా, ఉపాధ్యాయుడు మైటీన్ తనను వివాహం చేసుకున్నట్లు ఆ బాలిక అసలు విషయం బయటపెట్టింది. దీంతో నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే, పాఠశాల నిర్వాహకులు ఈ విషయంపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నందుకు గాను, నిందితుడు పర్రే మైటీన్పై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.

ఈ ఘటన స్థానికంగా మరియు విద్యా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share
Share