- జోహార్…హనమంతు
- మావోయిస్టు అగ్రనేత హనుమంతురావు అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన జనం
- చండూరు మండలం పుల్లెంలలో అంత్యక్రియలు
- వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే వీరేశం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
చండూరు, ఏపీబీ న్యూస్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతురావు అలియాస్ గణేష్ అంతిమయాత్ర ఆదివారం చండూరు మండలంలో పుల్లెంలో జరిగింది. హనుమంతురావుకు చివరి సారి వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఆదివారం కుటుంబ సభ్యులు ఉదయం 10 గంటల వరకు పుల్లెంలకు చేరుకున్నారు. అంత్యక్రియలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ పార్దివ దేహం స్వగ్రామానికి చేరుకోవడంతో పుల్లెంల గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు గణేష్ మృతదేహాన్ని చూడటానికి పుల్లెంల గ్రామానికి వచ్చారు. చిన్ననాటి స్నేహితులు గణేష్ ని చూసి కన్నీటి పర్వతం అయ్యారు. గణేష్ తమ కుటుంబానికి దూరమై 45 ఏళ్లు దాటిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

1961 లో జన్మించిన హనుమంతు విద్యార్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. డిగ్రీ చదువుకున్న సమయంలో రాడికల్ విద్యార్థి సంఘాలతో సంబంధం ఏర్పడిన గణేశ సుమారు 45 సంవత్సరాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత స్వగ్రామాన్ని విడిచి వెళ్లిన గణేష్, దశాబ్దాలపాటు కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని అధికారులు తెలిపారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అంచలంచెలుగా సిపిఐ ( మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్, జిల్లా డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మునగాల నారాయణరావు, పౌర హక్కుల సంఘం సభ్యులు , పూర్వ విప్లవ విద్యార్థి వేదిక నాయకులు విజయరామ రాజు, ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
