Municipal Results: మంథనిలో కాంగ్రెస్ జయకేతనం: శ్రీధర్ బాబు అభివృద్ధికి.. శ్రీను బాబు వ్యూహానికి దక్కిన విజయం

మంథని, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర కలిగిన మంథని గడ్డపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తూ అఖండ విజయాన్ని నమోదు చేసింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమర్థ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకం, ఆయన సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు పకడ్బందీ వ్యూహరచన ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మొత్తం 13 వార్డులు ఉన్న మంథని మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు:

  • కాంగ్రెస్ పార్టీ: 11 స్థానాలు
  • బీఆర్ఎస్ (BRS): 01 స్థానం
  • స్వతంత్రులు (Independent): 01 స్థానం

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ఒక పక్కా ప్రణాళిక కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో మంత్రిగా బిజీగా ఉంటూనే, రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, మంథనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు.

అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా క్షేత్రస్థాయిలోకి దూకిన దుద్దిళ్ళ శ్రీను బాబు, ప్రచార పగ్గాలను తన భుజానికెత్తుకున్నారు. ప్రతి వార్డులో పర్యటిస్తూ, యూత్ కాంగ్రెస్ మరియు సీనియర్ నాయకులను సమన్వయం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. “మంత్రి చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి చేర్చడమే మన లక్ష్యం” అన్న నినాదంతో ఆయన చేసిన కృషి ఓటర్లను బాగా ఆకట్టుకుంది.

గత కొంతకాలంగా మంథని పట్టణంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ, మరియు సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాటలు వేశాయి. ప్రచార సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను సైతం శ్రీను బాబు స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడం ప్రజల్లో భరోసా నింపింది.

ఫలితాలు వెలువడగానే మంథని పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేలుస్తూ, రంగులు చల్లుకుంటూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ విజయం కేవలం అభ్యర్థులది మాత్రమే కాదని, మంథని అభివృద్ధిని కోరుకునే ప్రతి సామాన్య పౌరుడిదని స్థానిక నాయకులు కొనియాడారు.

Share
Share