మంగళగిరి, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఓ భార్య ఆగ్రహంతో ఊగిపోయి, కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి హతమార్చింది. చిన్నపాటి గొడవ కాస్తా ప్రాణాల మీదకు తీసుకురావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.
ఘటన వివరాల్లోకి వెళితే..
మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) వృత్తిరీత్యా ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం అతనికి క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె మొదటి భర్త ప్రస్తుతం ఒక నేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అహ్మద్, క్రాంతిల మధ్య ఏర్పడిన సంబంధం వివాహానికి దారితీసింది. ఇద్దరూ కలిసి మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో నివసిస్తున్నారు.
రంజాన్ ఉపవాసం ఉన్న సమయంలోనే..
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం అహ్మద్ రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో క్రాంతి పెద్ద శబ్దంతో టీవీ చూస్తోంది. ఉపవాసంలో ఉండి కాస్త అసౌకర్యానికి గురైన అహ్మద్.. టీవీ సౌండ్ తగ్గించాలని భార్యను కోరాడు. దీనిపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. క్షానికవేశంలో ఊగిపోయిన క్రాంతి, ఇంట్లోని కత్తితో అహ్మద్ కడుపులో విచక్షణారహితంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో అహ్మద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆసుపత్రికి తరలించేలోపే మృతి
స్థానికులు గమనించి అహ్మద్ను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ, మార్గమధ్యలోనే అహ్మద్ ప్రాణాలు విడిచాడు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తు
నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె మొదటి భర్త నేర చరిత్ర కలిగి ఉండటం, ఇప్పుడు చిన్న కారణానికే రెండో భర్తను హత్య చేయడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య ఇలాంటి విషాదం నెలకొనడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది.