- ప్రకాశం బజార్ గురించి ఆనాడు అసెంబ్లీలో ప్రస్తావించిన మాజీ సీఎం
- నేడు చేతల్లో చూపించిన మంత్రి కోమటిరెడ్డి
- తెల్లవారుజామున 3గంటలకే లతీఫ్సాహెబ్ గుట్టపైకి
- గుట్ట పై నుంచి పట్టణాన్ని వీక్షించిన మంత్రి
- మళ్లీ 4 గంటలకు ప్రకాశంబజార్కు …
- అప్పటికప్పుడే అధికారులకు ఫోన్, జేసీబీలు, ట్రాక్టర్లు రాక
- ఉదయం 7గంటల వరకే డివైడర్లు కూల్చివేత
- మేయర్ కొలువుదీరిన 24గంటల్లోపే స్మార్ట్ సిటీ కార్యచరణ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్లో అనునిత్యం రద్ధీగా కనిపించే ప్రకాశం బజార్ రూపురేఖలు మారుస్తానని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో చెబితే నేడు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతల్లో చూపెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ ప్రకాశం బజార్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రద్ధీగా ఉండే ప్రాంతాల్లో ప్రకాశం బజార్ కూడా ఒకటని, ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తానని ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం మినహా మళ్లీ ఆ తర్వాత అటువైపు కన్నెత్తికూడా చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్పోరేషన్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ప్రకాశం బజార్లో ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలను స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చిన మంత్రి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3గంటలకే నిద్రలేచి లతీఫ్ సాహెబ్ గుట్ట పైకి వెళ్లారు. అప్పటికే అతని కారు డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో ఎస్కార్ట్ వాహనంలోనే మంత్రి గుట్టపైకి వెళ్లి అక్కడ నుంచి పట్టణాన్ని వీక్షించారు. గుట్ట పైన జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం తిరిగి 4 గంటలకు ప్రకాశం బజార్కు చేరుకున్నారు.

సైలెంట్ ఆపరేషన్ సక్సెస్
ప్రకాశం బజార్లో డివైడర్లు తొలగించే కార్యక్రమాన్ని మంత్రి సైలెంట్ గా ముగించారు. కనీసం అధికారులకు కూడా ముందస్తు సమాచా రం ఇవ్వలేదు. లతీఫ్ సాహెబ్ గుట్ట నుంచి 4గంటలకు ప్రకాశం బజార్కు చేరుకున్నా అప్పుడు మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో కమిషనర్, ఆర్డీఓ హుటాహుటిన ప్రకాశం బజార్కు చేరుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్లను తెమ్మని చెప్పి వెంటనే డివైడర్లు తొలగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రకాశం బజార్లో ఇటీవలే బోయవాడ స్కూల్ను ప్రారంభించిన మంత్రి, అక్కడ ప్రాంతంలో రద్ధీ విపరీతంగా పెరిగిందని, దాని వల్ల విద్యార్థులు, వ్యాపారులకు, వచ్చిపోయే జనాలతో ట్రాఫిక్ రద్ధీగా ఉందని దాని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన మంత్రి తెల్లారే సరికి మొత్తం డివైడర్లు తొలగించారు. ఉదయం 7 గంటలకే కూరగాయాలు అమ్మేందుకు వచ్చిన చిరువ్యాపారులు డివైడర్లు తొలగించడంతో కంగుతిన్నారు. 10 గంటలకు షాపులు తెరిచిన వ్యాపారులు మాత్రం డివైడర్ల తొలగింపుతో ప్రకాశం బజార్కు మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు.

ఓల్డ్ కలెక్టరేట్ వద్ద ప్రత్నామయ ఏర్పాట్లు
ప్రకాశం బజార్లో ఓల్డ్ కలెక్టర్ వద్ద ఉన్న ఖాళీ జాగలో చిరువ్యాపారులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని మంత్రి మున్సిపల్ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు వెంటనే తాత్కాలిక చర్యలు చేపట్టారు. డివైడర్లు తొలగించిన అనంతరం ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం, చిన్న సైజు డివైడర్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బుధవారం మంత్రి పర్యటనలో భాగంగా ప్రకాశం బజార్ యాక్షన్ ప్లాన్ వెల్లడించే అవకాశం ఉంది. స్మార్ట్ సిటీలో భాగంగానే మంత్రి బుధవారం శివాజీ నగర్, పద్మావతి కాలనీ ఏరియాల్లో కొత్త పార్క్లు కట్టేందుకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రకాశం బజార్లో అండర్ గ్రౌండ్ కరెంట్
ప్రకాశం బజార్లో పోల్స్ పైన వేలాడుతున్న కరెంట్ తీగలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రైవేటుగా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ తీగల వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరగుతుందో కూడా ఊహించడం కష్టం, దాదాపు 3వందలకు పైగా షాపులు ఉన్న ప్రకాశం బజార్లో అనుకోని ప్రమాదం జరిగితే జరిగే నష్టం ఊహించలేనిది, దీంతో పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ప్రకాశం బజార్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ ఇక్కడ సక్సెస్ అయితే పట్టణం మొత్తం విస్తరింప చేయాలనే ఆలోచనలో మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు.
