బెంగళూరులో నిర్వహించిన ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్లో పాల్గొని, ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి.
- టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం.
- డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి వాడుకోవచ్చు, యుద్ధానికి వాడుకోవచ్చు నిర్ణయించుకోవాల్సింది మనమే.
- అందరికీ సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) లేకుంటే అందరికీ సమాన అవకాశాలు అందించలేము.
- దేశంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ జూదం యొక్క ఘోరాలు భారీగా పెరుగుతున్నాయి కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేము.
టెక్నాలజీ ప్రపంచాన్ని మలచడంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునే విధంగా నూతన ఆవిష్కరణలు సాగాలని, సాంకేతికత అభివృద్ధి కావాలి, కానీ అది సమాజానికి మేలు చేయాలి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కానీ ప్రతి సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలి. ఆర్టిఫిషీయల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR), ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ (IoB) వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని మార్చగలవు. రేడియోలు మాయమయ్యాయి, టీవీలు వచ్చాయి, ఇప్పుడు పాడ్కాస్టుల హవా. ఫార్మాట్ మారుతుండొచ్చు, కానీ మానవ అవసరాలు ఎప్పటికీ మారవు.

సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరమవుతుంది. భవిష్యత్తు నిర్మాణం అంటే కేవలం రేపటి రోజుల్లో జీవించడం కాదు.. రేపటిని నిర్మించడం. ఇదే స్ఫూర్తితో సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలి. డ్రోన్స్ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చగలవు.. అదే డ్రోన్స్ విధ్వంసానికి ఉపయోగిస్తే అది ప్రమాదకరం. అందుకే ప్రతి టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంతో పెనువేసుకుంటున్న కొద్ది.. సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి.

టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు ఆలోచించాలి. సైబర్ నేరాలపైన కేవలం ఒక కాలర్ ట్యూన్ పెట్టి ఆపలేము. అంతేకాక, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వలన జరుగుతున్న దుష్పరిణామాలను ఆపడం ప్రభుత్వాలు నడిపే వారికి పెద్ద సవాలుగా మారింది. సాంకేతిక అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజూ భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి విద్యుత్, వాటర్ వినియోగంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు.
అంతేకాక, టెక్నాలజీ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకు వెళితే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ఐఓటీ, మోబైల్ యాప్లు, డేటా స్టోరేజ్ – ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ, అవి ఎంతగా పర్యావరణ భంగాన్ని కలిగిస్తున్నాయో ఆలోచించాలి. ప్రస్తుతం తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్ష గురించి మాత్రమే కాకుండా టెక్నాలజీ తెలిసినవారు టెక్నాలజీ తెలవని వారు అని సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైన దృష్టి సారించాలి. టెక్నాలజీ నిరక్షరాస్యత ఉన్న జనాభాకి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాలి. డిజిటల్ విభజన పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది.. టెక్నాలజీ అందరికీ సమానంగా అందినప్పుడే సమాన అవకాశాలు ఏర్పడతాయి