హైదరాబాద్(APB News): మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై, ముఖ్యంగా తలసానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ తో పాటు కంటోన్మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన తలసానికి కోట నీలిమ కౌంటర్ ఇచ్చారు.
మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో వేల కోట్లు కేటాయించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్నారు. గడిచిన రెండేళల్లో రేవంత్ రెడ్డి కృషి వల్లే ఎన్నో ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయన్నారు.

జూబ్లీహిల్స్లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే తలసాని రాజీనామా మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దని.. ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం లేదన్నారు. రాజీనామా డ్రామా పక్కనబెట్టి తన హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ పై తలసాని వివరణ ఇవ్వాలని కోరారు. గొర్రెల స్కామ్ తో తలసాని బీసీల పొట్ట కొట్టారన్నారు. బీసీల పొట్ట కొట్టిన తలసానికి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని నీలిమ ధీమా వ్యక్తం చేశారు. అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెడతారని ఆమె జోస్యం చెప్పారు.