Great: ఆరోగ్యం కోసం పంచాయతీల కఠిన ఆంక్షలు..జిల్లాకే ఆదర్శంగా పల్లెలు

కోరుట్ల/జగిత్యాల, ఏపీబీ న్యూస్: సాధారణంగా ఏదైనా నిబంధన అమలు చేయాలంటే ప్రభుత్వం జీవో ఇవ్వాలి.. పోలీసులు లాఠీ పట్టుకోవాలి. కానీ, జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాలు మాత్రం ‘మా ఆరోగ్యం మా చేతుల్లోనే’ అంటూ స్వచ్ఛందంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, గంజాయి లేని పల్లెలే లక్ష్యంగా పంచాయతీలు విధిస్తున్న జరిమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

కోరుట్ల నియోజకవర్గంలోని సంగెం గ్రామంలో ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడం గ్రామస్తులను కలవరపెట్టింది. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వినియోగమేనని గుర్తించిన పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది:

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: గ్రామంలో ప్లాస్టిక్ వాడితే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ప్రత్యామ్నాయం: శుభకార్యాలు, ఆలయాల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ సామాగ్రి లేదా విస్తరాకులు మాత్రమే వాడాలని నిబంధన పెట్టారు.

గంజాయి అమ్మితే రూ. 20 వేల ఫైన్!

కథలాపూర్ మండలంలో యువతను పట్టిపీడిస్తున్న గంజాయి భూతాన్ని తరిమికొట్టేందుకు గ్రామస్తులు నడుం బిగించారు.

బహుమతి: గంజాయి విక్రయించే వారి సమాచారం ఇస్తే రూ. 5,000 రివార్డ్ ఇస్తామని, అమ్మే వారికి రూ. 20,000 జరిమానా విధిస్తామని ప్రకటించి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

అయిలాపూర్ గ్రామం క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

పరిశుభ్రత: బహిరంగ మల విసర్జనపై నిషేధంతో పాటు, రోడ్లపై గాజు సీసాలు, ప్లాస్టిక్ పడేయకుండా నిఘా ఉంచారు.

ఐస్క్రీమ్ బండ్లకు నో ఎంట్రీ: కల్తీ ఆహారం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గమనించిన కొన్ని గ్రామాలు ఐస్క్రీమ్ బండ్లను గ్రామంలోకి రానివ్వడం లేదు.

పోలీస్ స్టేషన్లకు వెళ్తే రాజీ పడొచ్చనే ధీమా ఉండొచ్చు కానీ, ఊరి పంచాయతీ ముందు తలవంచక తప్పదు. కోరుట్ల నియోజకవర్గ గ్రామాల్లో కనిపిస్తున్న ఈ మార్పు అద్భుతం. ఒకప్పుడు కేవలం రాజకీయాలకు వేదికైన గ్రామ చావిడిలు, ఇప్పుడు ‘ప్రజారోగ్య కేంద్రాలు’గా మారుతున్నాయి. జరిమానా అనేది కేవలం శిక్ష కాదు, అదొక సామాజిక బాధ్యతను గుర్తు చేసే హెచ్చరిక. ఈ పల్లెల స్ఫూర్తి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు వ్యాపిస్తే, ఆరోగ్య తెలంగాణ లక్ష్యం సులభమవుతుంది.

Share
Share