- అభివృద్ధి చేస్తున్న చేతి గుర్తుకు ఓటు వేయండి
- జనాలు అడిగింది తడవుగా హామీలు వర్షం
- నల్గొండ లో మంత్రి కోమటిరెడ్డి రోడ్ షో
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంగళవారం చర్లపల్లి డివిజన్లోని బొడ్రాయి చౌరస్తా వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.
అభ్యర్థుల తరపున ప్రచారం
15వ డివిజన్ (చర్లపల్లి) కాంగ్రెస్ అభ్యర్థి పెరిక నాగరాజు, 14వ డివిజన్ (మర్రిగూడ) అభ్యర్థి బొజ్జ శంకరయ్య విజయానికి మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు మంత్రికి బ్రహ్మరథం పట్టారు.
30 ఏళ్లుగా మీ సేవలోనే..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ ప్రజలు తనను గత 30 ఏళ్లుగా ఆదరిస్తున్నారని, ఆరుసార్లు ప్రజాప్రతినిధిగా గెలిపించిన రుణం తీర్చుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
“పేదవాడి కన్నీళ్లు తుడిచేందుకే నా జీవితం అంకితం. నల్లగొండను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చుకున్నాం, ఇప్పుడు అదే స్థాయిలో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.” అని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
అపోజిషన్ పార్టీలకు ఓటు వేయడం అంటే అది వృథా చేయడమేనని మంత్రి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే అది మోరీలో వేసినట్టేనని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని, చేతి గుర్తును ఆదరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
తక్షణమే సమస్యల పరిష్కారం
ప్రచార సమయంలో రైతులు యూరియా కొరత గురించి ఫిర్యాదు చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, రైతులకు యూరియా అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే, చర్లపల్లి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు:
- శ్మశాన వాటిక: 2 ఎకరాల స్థలం కేటాయింపు.
- ఆరోగ్యం: స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు.
- మౌలిక సదుపాయాలు: విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం, క్రీడా ప్రాంగణం ఏర్పాటు.
- రహదారులు: శివాలయం రోడ్డు నిర్మాణం.
నిజమైన ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, నల్లగొండను స్మార్ట్ సిటీగా మారుస్తానని భరోసా ఇచ్చారు.