- కేసీఆర్ అసెంబ్లీ రా..? తాడోపేడో తేల్చుకుంటా…
- ఎందీ నువ్వు లెక్కపెట్టేది.. నీ బిడ్డ కవిత రోజూ మాజీ మంత్రుల చిట్టా విప్పుతోంది
- కల్వకుర్తిలో నిరంజన్ రెడ్డి, నల్లగొండలో జగదీష్‌రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్
- ఏ మొఖం పెట్టుకుని అసెంబ్లీకి వస్తవ్… ఒక్క ప్రాజెక్టు కట్టలేదు..ఒక్క ఇల్లు ఇవ్వలేదు
- అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని, కోల్పోయాక 24 నెలల నుంచి ఫాంహౌజ్లో పడుకున్నవ్
- ఆయన అసెంబ్లీకి వస్తడనే నమ్మకం ఇప్పటికీ లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మాజీ సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి నిజంగానే అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలెంజ్ చేశారు. ఆదివారం వలిగొండ, నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కొత్త సర్పంచ్ల సన్మాన సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పైన మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల నుంచి అసెంబ్లీకి వస్తానని మీడియాకు లీక్లు ఇవ్వడం తప్పా ఆయన వచ్చేది లేదన్నారు. ఈసారి కూడా వస్తడనే నమ్మకం లేదని, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కట్ట లేదని, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని కేసీఆర్ అసెంబ్లీలో ఏమొఖం పెట్టుకుని వస్తాడని ప్రశ్నించారు. మల్లన్నసాగర్, రంగసాయి సాగర్ నుంచి వంద కోట్లు కేటాయిస్తే ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు నీళ్లు వచ్చేవని, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కోరిన్నప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు.

కేసీఆర్ లెక్కలు కవితే చెప్తోంది..
నిన్నటి వరకు ఒక లెక్క…నేటి నుంచి మరో లెక్క అని అంటున్న కేసీఆర్ ..ఆయన చెప్పే లెక్కలన్నీ బిడ్డ కవిత జిల్లాలు తిరుగూతు చెప్తోందని ఎద్దేవ చేశారు. కల్వకుర్తిలో బస్సు ఎక్కేందుకు చార్జీ పైసలు కూడా లేని నిరంజన్ రెడ్డికి రెండు వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని కవిత నిలదీస్తోందని, నల్లగొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఐదు వేలు, పది వేలు అడుక్కునే ఆయనకు మూడు వేల కోట్లు, శంషాబాద్లో ఫాంహౌజ్ ఎక్కడి నుండి వచ్చాయని కవిత లెక్కలు బయట పెడుతోందని, ఇక కేసీఆర్ కొత్తగా చెప్పేలెక్కలు ఏంటనీ మంత్రి ప్రశ్నించారు. అధికారం ఉన్నప్పుడు కమీషన్ల పేరుతో దోచుకునేందుకు ప్రజాభవన్ వచ్చిన ఆయన అధికారం కోల్పోయాక ఫాంహౌజ్లో 24 నెలల నుంచి నిద్రపోయి ఇప్పుడు బయటకు వచ్చి కృష్ణా నీళ్ల పైన మీటింగ్లు పెడ్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆంధ్రాకు కాంట్రాక్టులు..రాయలసీమకు నీళ్లు…
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కృష్ణా నీళ్ల వాటా కోసం మూడు చోట్ల మీటింగ్లు పెడ్తానని చెప్తున్న కేసీఆర్..గత పదేళ్లలో కాలేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రాప్రాంతా కాంట్రాక్టర్లకు కట్టబెటి కమీషన్లు దోచుకున్నాడని, ఇక ఏపీ మాజీ సీఎం జగన్తో దోస్తీ కట్టి, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని, రాయలసీమకు కృష్ణా నీళ్లు దోచిపెట్టండని, ఇప్పుడొచ్చి మీటింగ్లు పెడ్తానంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి ధ్వజమెత్తారు.

తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్ష…
నువ్వు చెప్పే లెక్కలు ఏందీ? కేసీఆర్ పంపకాల లెక్క తప్పా నీ దగ్గర ఏ లెక్కలు లేవు? నువ్వు 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చిపోతే వాటిని తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తుండని మంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయిండని ఎద్దేవ చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకున్నప్పటికి నేను, సీఎం రేవంత్, ఉత్తమ్ ముగ్గురం ఎంపీలు కలిసి పార్లమెంట్లో బీజేపీని దుమ్మెత్తిపోశామని, అన్నారు. ప్రతిపక్ష నేత ఖర్గే రోజు పార్లమెంట్ వచ్చి మోడీ ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించారని, కానీ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ గత 24 నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉంటదో, ప్రతిపక్ష నేతగా కేసీఆర కు కూడా ప్రజల పట్ల అంతే బాధ్యత ఉంటదని, కానీ అసెంబ్లీకి వస్తానని మీడియాకు లీక్లు ఇవ్వడం తప్పా, అసెంబ్లీకి వస్తడనే నమ్మకం ఇప్పటికీ లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.