Municipal Elections: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఓటు వేయడమే: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

చండూరు, ఏపీబీ న్యూస్: “కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఓటు వేయడమే” అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకూ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ముందుగా స్థానిక మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి, అనంతరం కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు మరియు ఇతర వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించడంతో పాటు నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Komatireddy Rajgopal Reddy Campaigns in Chandur Municipality Elections Congress Development Agenda

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లే చండూరు మున్సిపాలిటీకి అభివృద్ధి నిధులు వచ్చాయని గుర్తు చేశారు. ఆనాడు మంజూరైన ప్రధాన రహదారి పనులను మధ్యలోనే వదిలేస్తే, తిరిగి రెండేళ్ల తర్వాత తానే చొరవ తీసుకుని పూర్తి చేశానని పేర్కొన్నారు. “వార్డు కౌన్సిలర్ అనే వ్యక్తి ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలా ఉండి సేవ చేయాలి” అని ఆయన ఆకాంక్షించారు.

తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, తమ శక్తి మేరకు పేదలకు సేవ చేస్తున్నామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ అదే సేవా దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి చండూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ప్రచార పర్వం రాత్రి 9 గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది.

Share
Share