- ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో పోటీ
- 43 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
- ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ వచ్చే అవకాశం
- స్టార్ క్యాంపైనర్లుగా నాగబాబు, హైపర్ ఆది రాక
- వార్డు సమస్యల పైన అభ్యర్థుల ప్రచారం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు బరిలో దిగారు. జనసేన పార్టీ తరపున 43 వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ లో కీలకంగా పనిచేస్తున్న అభిమానులను ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారు. మున్సిపాలిటీల్లో స్థానిక సమస్యలే ప్రధాన ఏజెండగా ప్రచారం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సతీష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో చిలుకూరు సర్పంచ్గా కస్తూరి సురేష్ పోటీ చేశారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు తమ అదృ ష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో చాలా వరకు చిరుద్యోగులు, చిన్నా, చితక వ్యాపారాలు చేసుకుంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. వీళ్లకు స్థానిక ప్రజల సపోర్ట్తో పాటు, ఇతర ఫ్యాన్స్ అసోసియేన్స్ కూడా మద్ధతుగా నిలిచాయి.
జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా
ఆయకట్టు ప్రాంతమైన హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేటలో చిరు, పవన్ అభిమాన సంఘాల సందడి కనిపిస్తోంది. చిరంజీవి బ్లడ్ బ్యాంకు, నేత్రదానం వంటి కార్యక్రమాలతో పాటు, జనసేన సిద్ధాంతాలను ఆచరిస్తున్న అభిమానులను ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ నుంచి కొంత ఎన్నికల సామాగ్రి అందజేశారు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, కేవలం స్థానిక సమస్యలే ఏజెండాగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేటలో పది మంది, హుజూర్నగర్లో 8, కోదాడలో 7, నల్లగొండలో 9, యాదగిరిగుట్టలో 3, మిర్యాలగూడలో ఇద్దరు, నేరేడుచర్ల, దేవరకొండలో అక్కడక్కడ ఒక్కక్కొరు చొప్పున 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారానికి పవన్ రాక!
అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి త్వరలో పవన్ కల్యాణ్ వస్తారని సతీష్ రెడ్డి చెప్పారు. 7,8,9 తేదీల్లో ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. స్టార్ క్యాంపైనర్లుగా ఎమ్మెల్సీ నాగబాబు, హైపర్ ఆది రానున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించే అవకాశం ఉంది. జనసేన పార్టీకి పునాదులు తెలంగాణలోనే పడ్డాయని, కల్యాణ్ కొండ గట్టు పర్యటనలో భాగంగా భారీగా నిధులు కేటాయించారని జనసేన సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం సేవ చేస్తున్నామని అభ్యర్థులు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరించాలని, ఎన్నో ఏళ్ల నుంచి గెలుస్తున్న రాజకీయ పార్టీలు వార్డుల్లో కనీస సమస్యలు కూడా పరిష్కరించలేదని, ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆదరించాలని కోరుతున్నారు.