Municipal Elections: కాంగ్రెస్‌ది చెడగొట్టే పని.. కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష: మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయడం తెలియదని, కేవలం బాగున్న వాటిని చెడగొట్టడమే ఆ పార్టీ నైజమని ఆయన విమర్శించారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. “కేసీఆర్ గారు మళ్లీ వస్తేనే బాగుంటుందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. గతంలో పెంచిన పచ్చదనాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ఎండబెడుతున్నారు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ముందే హెచ్చరించారు, ఇప్పుడు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు నట్టేట మునిగారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే ఎవరికైనా జ్ఞానం పెరుగుతుందని, కానీ రేవంత్ రెడ్డికి ఉన్న కాస్త జ్ఞానం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిలో ఉండి సమస్యలపై మాట్లాడకుండా, బూతులు మాట్లాడటం తెలంగాణ గౌరవానికి భంగం కలిగించడమేనని విమర్శించారు.

  • తెలంగాణ జాతిపిత: గాంధీజీలా ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణను సాధించారు. అందుకే ప్రజలు ఆయనను తెలంగాణ జాతిపితగా కొలుస్తున్నారు.
  • దిగజారుతున్న సంస్కారం: సీఎంగా రెండేళ్లు గడిచినా రేవంత్ రెడ్డిలో సంస్కారం పెరగకపోగా, రోత మాటలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.
  • నిబంధనల ఉల్లంఘన: నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం శంకుస్థాపనలు చేయడం అప్రజాస్వామికం.

మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, సీఎం అసభ్య పదజాలం తమ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Share
Share