హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కన్నతల్లిపై ఉన్న ప్రేమ ఆ యువతి పాలిట శాపమైంది. మానసిక స్థితి సరిగ్గా లేని తల్లిని విడిచి ఉండలేక, తనను అర్ధం చేసుకునే తోడు దొరకలేదన్న ఆవేదనతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగింది?
మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి (26) మాదాపూర్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి గతంలోనే మరణించగా, కూకట్పల్లి పరిధిలోని మైత్రీ నగర్లో తన తల్లితో కలిసి నివాసముంటోంది. విజయలక్ష్మి తల్లి కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తల్లి బాగోగులన్నీ విజయలక్ష్మియే స్వయంగా చూసుకునేది.
పెళ్లి సంబంధాల్లో ఎదురైన చేదు అనుభవాలు
వయసు పైబడుతుండటంతో విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు ఇటీవల పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. అయితే, తన తల్లి పరిస్థితి దృష్ట్యా.. పెళ్లి తర్వాత కూడా తల్లి తనతోనే ఉంటుందని ఆమె నిబంధన విధించేది. తల్లి బాధ్యతను పంచుకోవడానికి ఏ వరుడు, వారి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. వరుసగా సంబంధాలు తప్పిపోతుండటం, తల్లిని చూసుకోవడం తనవల్ల కాదేమోనన్న భయం ఆమెను కుంగదీశాయి.
అదృశ్యం.. ఆపై శవమై..
తీవ్ర మనోవేదనకు గురైన విజయలక్ష్మి శనివారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. కాగా, ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్ సమీపంలో ఒక మహిళ మృతదేహం నీటిపై తేలుతున్నట్లు గుర్తించిన లేక్ పోలీసులు, దానిని వెలికితీశారు. దర్యాప్తులో అది విజయలక్ష్మి మృతదేహంగా నిర్ధారించారు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కన్నతల్లిని అనాథగా వదలకూడదన్న గొప్ప సంకల్పం ఉన్నా, సమాజం నుండి ఆశించిన మద్దతు లభించక ఒక ప్రతిభావంతురాలైన యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది.