- ఇండిపెండెంట్లను ప్రోత్సహిస్తున్న బీఎల్ఆర్
- గూడెం రాజకీయాల నుంచి భార్గవ్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర
- ఎంపీ రఘువీర్ వర్గీయులు సైతం ఓటమి భయం..
- 35 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ ధీమా, 14 సీట్లకే కాంగ్రెస్
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆనవాళ్లు తుడిచిపెట్టేందుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సరికొత్త డ్రామాకు తెరలేపారు. భార్గవ్ వర్గీయులు ఓడిపోతున్నారని సొంత పార్టీ నేతల నుంచే ప్రచారం చేయిస్తున్నారు. ఒప్పందం మేరకు భార్గవ్కు ఇచ్చిన మూడు వార్డుల్లో అభ్యర్థులు గెలవడం కష్టమని, అక్కడ బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలడంతో దీన్నే అదునుగా భావించిన ఎమ్మెల్యే భార్గవ్ను టార్గెట్ చేశారు. మొదటి నుంచి భార్గవ్ పెత్తనాన్ని జీర్ణించుకోలేకపో తున్న ఎమ్మెల్యే పెద్దల ఒప్పందం మేరకు మూడు వార్డులైతే ఇచ్చారు, కానీ అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశం ఏమాత్రం కనిపించడం లేదు.
భార్గవ్ వర్గాన్ని ఓడించడం ద్వారా మిర్యాలగూడలో ఆయన అడ్డుతొలగించుకోవచ్చని, పైగా పార్టీ వద్ద దోషిగా నిలబెట్టొచ్చని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. భార్గవ్కు టికెట్లు ఇచ్చిన 22,28,34 వార్డుల్లో అభ్యర్థులు గెలవడం కష్టమని, అవనసరంగా టికెట్లు ఇచ్చి తప్పుచేశామని సొంత పార్టీ నేతలతోనే ప్రచారం చేస్తున్నారు. ఈ వార్డుల్లో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో కాంగ్రెస్ గెలుపు సాధ్యం కాదని తేలిపోవడంతోనే ఎమ్మెల్యే భార్గవ్ వర్గీయులను పక్కనపెట్టి స్వతంత్రులను ప్రోత్సహిస్తున్నారు. ఇండిపెండెంట్లను గెలిపించేందుకే అయ్యే ఎన్నికల ఖర్చు కూడా ఎమ్మెల్యే భరించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే ఎత్తులను పసిగట్టిన భార్గవ్ ఎట్టి పరిస్థితుల్లో తన వర్గాన్ని గెలిపించుకుని మున్సిపాలిటీలో తన సత్తా ఏంటో చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.
బీఆర్ఎస్కు పెరిగిన గ్రాఫ్
48 వార్డుల్లో బీఆర్ఎస్ 35, కాంగ్రెస్ 13 నుంచి 15 వార్డులకే పరిమితమైందని తాజా సర్వే గణాంకాలు చెపుతున్నాయి. సీఎం రేవంత్ సభ ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పడిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఆరు గ్యారెంటీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఆయన కొడుకు సిద్ధార్ధ సక్సెస్ అయ్యారు. పైగా పట్టణంలో గత పదేళ్లలో 854 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ రెండేళ్లలో చేశామని చెప్తున్న 295 కోట్ల పనుల జాడ ఎక్కడ ఉందో చెప్పాలని విసిరిన సవాళ్లకు ఎమ్మెల్యే నోరెత్తలేకపోయారు.