- పంచాయతీ ఫలితాల పై… ఇంటిలిజెన్స్ ఆరా
- బీఆర్ఎస్ ప్రభావితం చూపిన సెగ్మెంట్ల పైన గురి
- రెబల్స్ వల్ల పార్టీ క్యాండేట్లకు భారీ నష్టం
- కేడర్‌ను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యేలు విఫలం
- క్షేత్రస్థాయిలో కూపీ లాగుతున్న ఇంటిలిజెన్స్ టీమ్స్
- ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పథకాల పైన ఎంక్వైరీ
- ఆలస్యం చేయోద్దనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ సన్నాహాం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల పైన ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మెజార్టీ సర్పంచ్‌లు కాంగ్రెస్ మద్ధతుదారులే అయినప్పటికీ పలు చోట్ల ఊహించ నీరీతిలో బీఆర్ఎస్ దెబ్బకొట్టడం షాక్‌కు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన సెగ్మెంట్లలో పంచాయతీ ఫలితాలు తీవ్రనిరాశకు గురిచేశాయి. ప్రధానంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న ఆలేరు, భువనగిరి, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగ ర్, తుంగతుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్లగొండ తో పాటు, తెరవెనక చక్రం తిప్పుతున్న సీనియర్ నేత జానారెడ్డి సెగ్మెంట్ నాగార్జునసాగర్‌లో కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపింది. రెబల్స్‌ను కంట్రోల్ చేయలేకపోవడం, గ్రామ స్థాయిలో పార్టీ సమన్వయం చేయడంలో సీనియర్లతో సహా, కొత్త ఎమ్మెల్యేలు విఫలమయ్యారని, దాంతోనే బీఆర్ఎస్ క్యాండేట్లు గెలిచారనే వాధన పార్టీలో వినిపిస్తోంది. కాంగ్రెస్ బలహీనంగా ఉందని భావించే గ్రామాలతో పాటు, రెబల్స్ గెలుపుకు బీఆర్ఎస్ కేడర్ పరోక్షంగా సహరించింది. అంతేగాక మాజీ ఎమ్మెల్యేలు భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, మిర్యాలగూడ, మునుగోడు, తుంగతుర్తిలో అభ్యర్థులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించారు.

సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా …
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలు నిష్పక్షపాతంగా అమలు చేస్తున్న.. పల్లె ఓటర్లు ఎందుకు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాల్సి వచ్చింది? ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రజల్లో ఉన్న వైఖరి ఎంటీ ? అనే కోణాల్లో ఇంటిలిజెన్స్ టీమ్స్ కూపీ లాగుతున్నాయి. విడతల వారీగా ఫలితాల రిపోర్ట్‌ను ప్ర భుత్వానికి నివేధిస్తున్న ఇంటిలిజెన్స్ వర్గాలు, బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చిన గ్రామాల్లో పరిస్థితుల గురించి విచారిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రధానమైన నియోజకవర్గంలో యువ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, దాంతో అక్కడి ప్రజలు ఆయన పట్ల నిరాసక్తతతో ఉన్నారని ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లో తేలింది. ఫించన్లు, రైతుభరోసా వంటి పథకాలు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఇదేరకమైన వాతావరణం కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది.

ఆలస్యమైతే మరింత నష్టం…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయని మండలాల్లో కూడా ఆపార్టీ మద్ధతుదారులు గెలిచారు. అంతేగాక మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ క్యాండేట్లు, రెబల్స్ సత్తా చాటారు. ఉదాహరణకు చండూరు, రామన్నపేట మండలం వెల్లంకి, ఇంద్రపాలనగరం, సిరిపురం, కట్టంగూరు, అయిటిపాముల ఇలా మూడు వేల పై చిలుకు ఓట్లు ఉన్న గ్రామాల్లో బీఆర్ఎస్ సపోర్టర్స్ గెలిచారు. దీనివల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి మరింత ఆలస్యమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రెబల్స్ తీవ్రత పెరిగిపోయి, ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుందని గ్రహించిన సర్కార్ ఈ నెలాఖరున మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు స న్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఏప్రిల్ నుంచి కొత్త ఫించన్ లు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద పంచాయతీ ఎ న్నికలు ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి.