- మున్సిపాలిటీల్లోనే ఇందిరమ్మ ఇళ్లు..గ్రామాల్లో కొత్త శాంక్షన్లు బంద్
- అర్బన్లో నిర్మాణాలు పెంచాలని హౌజింగ్ ఆదేశాలు
- ప్రతి మున్సిపాలిటీలో 500 ఇళ్లు టార్గెట్
- కేంద్ర ఇచ్చే పీఎంఏవై సాయం అర్బన్లో రూ.1.68 లక్షలు
- దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనున్న ఇళ్ల నిర్మాణ భారం
- నాలుగు మున్సిపాలిటీల నుంచి 430 శాంక్షన్
- మిర్యాలగూడ, చిట్యాల, నందికొండ, నకిరేకల్ జీరో
- పాత గృహాలక్ష్మీ లబ్ధిదారులకు ఊరట.. ఇందిరమ్మ ఇళ్ల కింద గ్రౌండింగ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. వాటికి బదులుగా మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పైన ఫోకస్ పెట్టాలని రాష్ట్ర హౌజింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇళ్లను సైతం అర్బన్ ప్రాంతాలకు డైవర్ట్ చేయాలని, ఇక నుంచి గ్రామాల్లో కొత్తగా ఇళ్లు మంజూరు చేయోద్దని జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్బన్లో నిర్మించే ఇళ్లకు 1.68 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. అదే గ్రామాల్లో అయితే రూ.75వేలు మాత్రమే, గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు శాంక్షన్ చేస్తుండగా, కేంద్రం నుంచి రూ.75వేల సాయం అందుతోంది. అదే అర్బన్లో ఇళ్లు నిర్మిస్తే ఒక్కో ఇంటికి రూ.1.68లు భారం తప్పుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.3.32 లక్షలు శాంక్షన్ చేస్తే, కేంద్రం నుంచి రూ. 1.68 లక్షలు సాయం అందుతుంది. అదే రూరల్లో అయితే కేంద్రం రూ.75వేలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.4.25 లక్షలు చెల్లిస్తోంది, పైగా ఇప్పటి వరకు అర్బన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. మొదటి, రెండు విడతల్లో గ్రామీణ ప్రాంతాలకే మంజూరు చేశారు.
అర్బన్లో ఇళ్లకు డిమాండ్
అర్బన్లో ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇళ్ల సమస్యే ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అందించే సాయాన్ని మున్సిపాలిటీల్లో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు ప్రజలకు లబ్ధిచేకూరడమేగాక, ప్రభుత్వం పైన ఆర్ధిక భారం తప్పుతుంది. ఈ ఉద్దేశంతోనే ప్రతి మున్సిపాలిటీలో కనీసం 500 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టింది. దీనిలో భాగంగానే హౌజింగ్ ఆఫీసర్లు గతంలో వచ్చిన ఆప్లికేషన్స్ను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
నల్లగొండకు 450 ఇళ్లు శాంక్షన్
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నల్లగొండ, హాలియా, చండూరు మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటి వరకు 450 ఇళ్లు శాంక్షన్ చేశారు. మిర్యాలగూడ, నందికొండ, నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీల్లో ఒక్క ఇళ్లు కూడా శాంక్షన్ కాలేదు. మిర్యాలగూడ, చిట్యాల, నకిరేకల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయనే సాకుతో అర్బన్లో ఇందిరమ్మ ఇళ్ల అవసరం లేదని అక్కడి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇక నందికొండలో మొత్తం భూములు ఎన్నెస్పీ కింద ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఇళ్లు శాంక్షన్ చేయడం కుదరదు, పైగా గత ప్రభుత్వంలోనే 59 జీవో కింద ఇక్కడ ఇళ్లను నివాసితులు క్రమబద్ధీకరించుకున్నారు. రెండో విడతలో పెండింగ్ ఇళ్లను కూడా క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. కాబట్టి నందికొండలో ఇందిరమ్మ ఇళ్ల అవసరం ఉండదని చెప్తున్నారు.
ప్రతి మున్సిపాలిటీకి 500 టార్గెట్
ప్రతి మున్సిపాలిటీకి 500 ఇళ్లు టార్గెట్ పెట్టారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు అందాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిపొందేందుకు కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలి. పాత ఇంటిని కొత్తగా చూపించడం కుదరదు. దీనికోసం కేంద్రం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించింది. ఇంటి నిర్మాణం లొకేషన్, డిజైన్లు, ఫోటోలు అన్నీ యాప్లో అప్ లోడ్ చేస్తే లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందుతుంది. గతంలో మున్సిపాలిటీల్లో వచ్చిన ఆప్లికేషన్స్తో పాటు, కొత్తగా ఇళ్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకోవచ్చు. నల్లగొండ, దేవరకొండ, చండూరు, హాలియా మున్సిపాలిటీల్లో వంద చొప్పున శాంక్షన్ చేశారు.
గృహాలక్ష్మీ లబ్ధిదారులకు ఊరట
బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన గృహాలక్ష్మీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు మధ్యలోనే స్కీం ఆపేశారు. అప్పట్లో శాంక్షన్ ఆర్డర్లు పొందిన లబ్ధిదారులు బేస్మెంట్ వరకు ఇళ్లు కట్టారు, కానీ బిల్లులు రాలేదు. మళ్లీ ఆ లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. దాంతో అప్పుడు కట్టుకున్న గృహలక్ష్మీ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కింద గ్రౌండింగ్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బేస్మెంట్ లెవల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్లకు లక్ష రూపాయాలు మినహాయించి, మిగతా నాలుగు లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ రకంగా నల్లగొండ జిల్లాలో 150 మందికి శాంక్షన్ ఇచ్చారు. అప్పుడు డిజైన్లు, రూల్స్ లేవు. కేవలం సొంత జాగ ఉన్నవాళ్లు ఇళ్లు కట్టుకుంటే రూ.5లక్షలు ఇస్తామని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం 600 అడుగుల్లో ఇళ్లు కట్టుకుంటేనే రూ.5లక్షలు ఇస్తామనే నిబంధన అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.