హైదరాబాద్(APB News): గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రాంగోపాల్ పేట్, బన్సీలాల్ పేట్ డివిజన్లలో జరిగిన ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇందులో భాగంగా మోండా మార్కెట్, బోయగూడ, నెక్లెస్ రోడ్డులో గల ఇందిర గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. పేద బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందన్నారు.