- రూ.5వేల నుంచి ఆ పైన ఎంతైన లెక్కచేయలే
- బియ్యం, నూనె, చీరలు, చికెన్ పంపిణీ
- చైర్మన్ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డుల్లో ఫుల్ గిరాకీ
- బలమైన అభ్యర్థులున్న వార్డుల్లో పార్టీని సైతం లెక్కపెట్టలే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు రూ.25 వేలు పలికింది. చైర్మన్ పదవి ఆశిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్‌గా గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. కౌన్సిలర్ పదవినే ప్రతిష్టాత్మకంగా భావించిన బలమైన అభ్యర్థులు సైతం ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు. చీరలు, చికెన్, బియ్యం, వంట నూనెలు కూడా ఓటర్లకు పంపిణీ చేశారు. పోలింగ్ జరిగే రోజు కూడా నాన్‌లోకల్ ఓటర్లుకు రానుపోను ఖర్చులతో కలిపి ఒక్క ఓటుకు రూ.10వేలు కూడా చెల్లించారు. సూర్యాపేట, చౌటుప్పుల్, పోచంపల్లి, చండూరు, చిట్యాల, యాదగిరిగుట్ట, నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్లలో లెక్కనేంతగా డబ్బు ఓటర్ల జేబుల్లోకి వెళ్లింది.
సూర్యాపేటలో 46 వార్డులో 50 కోట్లు
సూర్యాపేటలో 46 వార్డులో రూ.50 కోట్లు పంపిణీ చేశారు. ఇక్కడున్న ఓటర్లు కేవలం 1350 మాత్రమే. ఓటుకు 25 వేల వరకు చెల్లించారు. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్ధి నివేధితన ఓడించేందుకు బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.25వేల వరకు చెల్లించినట్టు ప్రచారం జరిగింది. రెబల్ అభ్యర్థిగా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ భార్య గాయంత్రి, బీఆర్ఎస్ నుంచి బావోసింగ్, బీజేపీ నుంచి కార్గిల్ అమరవీరుడు బిడ్డ మౌనిక పోటీ చేశారు. చైర్మన్ క్యాండేంట్ను ఓడించేందుకు ఈ వార్డుల్లో ట్రయాంగిల్ వార్ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని టార్గెట్ చేశారు. సూర్యాపేటలో అతిపెద్దదైన 14 వార్డులో 2900 మంది ఓటర్లు ఉండగా, ఇక్కడ ఓటుకు రూ.5వేలు చెల్లించినట్టు తెలిసింది.
నల్లగొండ కార్పోరేషన్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థి 5వేలు ఇస్తే, బీజేపీ క్యాండేట్ 4 వేలు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి 5వేల వరకు పంపిణీ చేసినట్టు తెలిసింది.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో 3,6 వార్డుల్లో ఒక్క ఓటుకు 6వేలు పంపిణీ చేసినట్టు సమాచారం. మూడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ రేసులో ఉండగా, 6 వార్డు అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కోదాడ మున్సిపాలిటీలో జనరల్ వార్డుల్లో మూడు వేల వరకు పంపణీ చేయగా, హుజూర్‌నగర్‌లో 18 వార్డుల్లో రెండుసార్లు ఓడిపోయిన జక్కల మల్లయ్య ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ డబ్బుల పంపిణీ జరిగింది. 25 కేజీల బియ్యం, ఐదు లీటర్ల వంట నూనె, ఓటుకు 6వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది.
చండూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ జరిగింది. దీంతో ఓటుకు 20 వేల చొప్పున పంపిణీ చేశారు. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరుపార్టీలు పోటాపోటీగా ఎన్నికల ఖర్చు పెట్టారు.
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ క్యాండేట్ ఓటుకు రూ.10 నుంచి రూ.8వేల వరకు పంపిణీ చేశారు. పోలింగ్ ముందు రోజు రాత్రి 12వార్డుల్లో అభ్యర్థులకు ఒక్కో వార్డుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు. తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఏకంగా రూ.12వేలు ముట్ట చెప్పారు. మిగితా వార్డుల్లో 6 నుంచి 12వేల వరకు పంపిణీ చేశారు.
చౌటుప్పుల్ మున్సిపాలిటీలో లింగోజిగూడెంలో ఒక్క ఓటుకు 15 వేలు చెల్లించారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో ఎన్నికల ఖర్చుకు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 16 వార్డులో మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు భార్య పైన పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి జయమ్మ గట్టిపోటీ ఇచ్చింది. అసలు ఏకగ్రీవం చేద్దామని ప్లాన్ చేశారు, బీఆర్ఎస్ కూడా పోటీ నుంచి తప్పుకుంది, కానీ పార్టీ గుర్తించి తమకు టికెట్ ఇచ్చిందని జయమ్మ పోటీలోనే ఉన్నారు. జయమ్మను డమ్మీ అభ్యర్థిగా తక్కువ అంచనా వేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్తున్నారు. ఓటుకు రెండువేలు పంపిణీ చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు జయమ్మ.
భూధాన్ పోచంపల్లిలో ఓటుకు 3 నుంచి 5వేలు చెల్లించగా, బీఆర్ఎస్ కొన్ని వార్డుల్లో 1500, కాంగ్రెస్ 5 వేల వరకు పంపిణీ చేసింది. పదో వార్డుల్లో బీఆర్ఎస్ ఓటుకు 10 వేల వరకు చెల్లించింది. ఒకటో వార్డులో 5, 6 వేల వరకు ముట్టచెప్పారు.