Video: దారుణం: కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి ముందుకు రాని గ్రామస్థులు

జగిత్యాల, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా గ్రామస్థులు నిరాకరించడంతో, భార్య, అక్కలు పాడె మోయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటన బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. అయితే, మృతికి ముందు నుంచే రాజేశం కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ కారణంగా వారి కుటుంబంతో గ్రామస్థులు ఎవరూ మాట్లాడకపోగా, ఏ ఇతర సేవలు అందించకుండా నిలిపివేశారు.

రాజేశం మృతి చెందిన తర్వాత అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు గ్రామస్థుల సహాయం కోరారు. కానీ, గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు అంత్యక్రియల్లో పాల్గొనకూడదని, ఎవరూ పాడె మోయకూడదని గ్రామస్థులను, దూరపు బంధువులను గట్టిగా ఆజ్ఞాపించారు.

సహాయం కోసం కుటుంబ సభ్యులు పెద్దలను కాళ్లు మొక్కి బతిమాలినా సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలు కానీ కనికరించలేదు. ఈ ఆజ్ఞల కారణంగా రాజేశం మృతదేహం గంటల తరబడి ఇంట్లోనే ఉండిపోయింది.

చివరకు, చేసేది లేక కుటుంబ సభ్యులే నడుం బిగించారు. రాజేశం భార్య, అక్కలు కన్నీరుమున్నీరవుతూ తామే పాడె మోశారు. ఈ దృశ్యం చూసిన గ్రామ ప్రజలు సైతం చలించిపోయారు, కానీ సర్పంచ్ భయంతో ఎవరూ ముందుకు రాలేదు.

కుల బహిష్కరణ సాకుతో మనిషి చనిపోయాక కూడా గౌరవం దక్కకుండా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులైన సర్పంచ్, కుల పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share
Share